మీడియా ముందుకు అత్యాచార బాధితురాలు... నిందితులను కాపాడేందుకే: నాగుల్ మీరా

Arun Kumar P   | Asianet News
Published : Oct 07, 2020, 02:11 PM IST
మీడియా ముందుకు అత్యాచార బాధితురాలు... నిందితులను కాపాడేందుకే: నాగుల్ మీరా

సారాంశం

లైంగిక వేధింపులకు గురయిన బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, మధ్యవర్తిత్వం పేరుతో మంతనాలు చేయడం దారుణమని నాగుల్ మీరా మండిపడ్డారు. 

రాజమండ్రి రూరల్ పరిధిలోని బొమ్మూరులో మైనారిటీ బాలికపై జరిగిన అత్యాచారయత్నం ఘటనలో ఆమె తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడని... ఈ ఘటన గత నెల 1వ తేదీన జరిగితే 5వ తేదీవరకు ఏమంత్రీ, అధికారి ఆయన్ని పరామర్శించలేదని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వం ఈ దారుణ ఘటనకు మసిపూసిమారేడు కాయ చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, మధ్యవర్తిత్వం పేరుతో మంతనాలు చేయడం దారుణమని నాగుల్ మీరా మండిపడ్డారు. జరిగిన దారుణంపై చంద్రబాబునాయుడు  టీడీపీ తరుపున 5వతేదీన నిజనిర్ధారణ కమిటీ వేశాకే అధికారులు ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. 

జక్కంపూడి రాజా సోదరుడు, జక్కంపూడి గణేశ్ అత్యాచారయత్న ఘటనలో నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తూ బాలికను మీడియా ముందుకు తీసుకొచ్చాడన్నారు.  సత్తార్ వైసీపీ వారికి అత్యంత సన్నిహితుడైతే తన బిడ్డకు అన్యాయం జరిగిందనిఆయన కేసుపెట్టిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని, అత్యాచారయత్నం చేసినవారిని కాపాడటానికి వైసీపీ వారు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్పీ కార్యాలయం ఎదుటనే బాధితుడు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడో చెప్పాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు.  

టీడీపీకి చెందిన మైనారిటీ నేతలు సత్తార్ వద్దకు వెళ్లాకే, వైసీపీ నేతలకు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా గుర్తొచ్చిందన్నారు. సత్తార్ కు ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని టీడీపీ డిమాండ్ చేస్తే ప్రభుత్వం కాకుండా జక్కంపూడి గణేశ్ ఎందుకు స్పందించాడో చెప్పాలన్నారు. సత్తార్ కు గణేశ్ వైద్యం చేయిస్తాడా లేక ప్రభుత్వం చేయిస్తుందో చెప్పాలన్నారు.  జరిగిన దారుణంపై మంత్రులెవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. 

read more   దళిత మైనర్ బాలికపై అత్యాచారయత్నం... అన్నలా అండగా వుంటానన్న లోకేష్

అభంశుభం తెలియని పదేళ్ల  బాలికపై కొందరు దుర్మార్గులు అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించారని... జరిగిన అవమానాన్ని తట్టుకోలేక బాధతో న్యాయంకోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాలిక తల్లిదండ్రుల నుంచి కేసు తీసుకోకుండా పోలీసులు వేధించారన్నారు.  కేసు నమోదుచేశాక పోలీసులు 8రోజులవరకు కాలయాపన చేశారని, కేసువాపసు తీసుకోవాలంటూ చిన్నారి తల్లిదండ్రులను బెదిరించారన్నారు. వారుధైర్యంగా నిలబడి న్యాయంకోసం మొండికేయడంతో చివరకు వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు.

నిందితులపై పోలీసులు కేసునమోదు చేశాక వారు వెంటనే 4రోజుల్లోనే బెయిల్ పై బయటకు వచ్చారని, అప్పటినుంచీ ప్రతిరోజూ సత్తార్ కుటుంబంపై పడి అందరినీ వేధించడం ప్రారంభించారన్నారు.  కేసు రాజీపడాలని సత్తార్ ను, ఆయన కుటుంబాన్ని వైసీపీ నేతలు బెదిరించడం జరిగిందన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే కుటుంబం మొత్తం విషంతాగి చనిపోవాలని చూసిందన్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుటే ఒక బాధితుడు న్యాయం కోసం పురుగుల మందు తాగడం ఈ ప్రభుత్వానికి ఎంతటి సిగ్గుమాలినతనమో వైసీపీనేతలే సమాధానం చెప్పాలన్నారు. 

మైనారిటీలు, దళితులపై తన ప్రభుత్వంలో ఇన్ని ఆకృత్యాలు జరుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు. ఏరోజుకు ఆరోజు పనిచేసుకుంటే తప్ప బతకలేని మైనారిటీ కుటుంబంపై, వైసీపీ దుర్మార్గులు ఎంత కిరాకతంగా ప్రవర్తించారో అందరికీ తెలుసునన్నారు. బాలికను, ఆమె కుటుంబాన్ని ఆదుకోకుండా బెదిరించిన వైసీపీనేతలు మైనారిటీ బాలిక కుటుంబ సభ్యులను విలేకరుల ముందుకు తీసుకొచ్చారన్నారు. సత్తార్ కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు బాధ్యత వహించాల్సింది జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలేనని టీడీపీనేత తేల్చిచెప్పారు. 

సత్తార్ కుటుంబానికి అన్యాయం జరిగితే రాష్ట్రంలోని మైనారిటీ నేతలంతా పార్టీలకతీతంగా ఏకమై ఛలో బొమ్మూరు కార్యక్రమాన్ని చేపడతామన్నారు.    నిజంగా వైసీపీ ప్రభుత్వానికి మైనారిటీలపై ప్రేమ, ముఖ్యమంత్రికి మనసుంటే తక్షణమే మైనారిటీ కుటుంబానికి న్యాయంచేయాలని... రూ.20లక్షల వరకు పరిహారం అందించాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఐపీసీ కోడ్ అమలవుతుందా..లేక వైసీపీ కోడ్ అమలవుతుందా? అని ఆయన నిలదీశారు. జరిగిన ఘటనపై డీఐజీ మాట్లాడుతూ టీడీపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారని చెబుతున్నాడని... అత్యాచారయత్నం ఘటన జరిగి 15రోజులైనా ముద్దాయిలను పట్టుకోకుండా పోలీసులు ఏం చేస్తున్నారో ఆయన చెప్పాలన్నారు. పోలీసుల పని పోలీసులను చేయనివ్వకుండా ప్రభుత్వమే అడ్డుకుంటోందని, నియంత్రత్వంగా పాలనచేస్తూ ప్రజలను, అధికారులను బెదిరిస్తున్నారన్నారు.  జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంకెన్ని ఆకృత్యాలు చూడాల్సి వస్తుందోనన్నారు. నియంత్రత్వ పాలన చేయాలనుకున్నవారు ఎవరూ చరిత్రలో రాణించలేదన్న నిజాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు. 

పదేళ్ల పసికందుపై అత్యాచారయత్నం జరిగితే, మహిళగా ఉన్నహోం మంత్రి ఎందుకు స్పందించలేదని టీడీపీనేత నిలదీశారు. దిశ పోలీస్ స్టేషన్లు దశలేకుండా పనిచేస్తున్నాయని, హోంమంత్రే స్పందించకపోవడం దారుణమన్నారు.  ప్రజా సమస్యలపై పోరాడటమే టీడీపీ లక్ష్యమని,దాన్ని అడ్డుకోవడం ఈప్రభుత్వ తరం కాదన్నారు. టీడీపీవారు మైనారిటీ బాలికను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విషప్రచారం చేయడంతప్ప వైసీపీకి మరోపనిలేకుండా పోయిందన్నారు నాగుల్ మీరా. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu