
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు సన్నిహితులందరినీ తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టేసిందని ప్రముఖ నటుడు, మాజీ ఎంపి కైకాల సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయనకు సావిత్రి కళాపీఠం ఆద్వర్యంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా టిడిపితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సరే, కైకాల చెప్పినదాంట్లో తప్పేమీలేదు. ఎందుకంటే, గతంలో కూడా ఈ విషయాన్ని పలువురు చెప్పారు. వడ్డే శెభనాద్రీదశ్వరరావు, యలమంచిలి శివాజీ, వసంత నాగేశ్వరరరావు తదిరులు ఎన్టీఆర్ ఉన్నపుడు బాగా వెలిగారు. అటువంటిది ఎన్టీఆర్ మరణంతోనే వారంతా పార్టీకి దూరమైపోయిన విషయం అందరకీ తెలిసిందే.
తాను కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడినేనని ఆయన చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనను టిడిపి ప్రభుత్వం ఏనాడు సంప్రదించలేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం చేశారని చెప్పారు.
గతంలో మచిలీపట్నం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచానని తెలిపారు. నమ్మక ద్రోహం వల్ల పదవి పొగొట్టుకున్న సమయంలో ఎన్.టి.ఆర్ ఎంతో బాధ పడ్డారని సత్యనారాయణ చెప్పారు. ఆయన తనను నమ్ముకున్నవాళ్లందరికి ఏదో ఒకటి చేశారని ఆయన కైకాల పేర్కొన్నారు. సభా ముఖంగానే సత్యనారాయణ పై వ్యాఖ్యలు చేయటంతో పార్టీలో పెద్ద చర్చ మొదలైంది.
పనిలో పనిగా అవార్డుల గురించి కూడా మాట్లాడారు. ప్రభుత్వ పురస్కారాల కోసం చాలా లాబీయింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. అది తనకు ఇష్టం లేదని అన్నారు. ప్రభుత్వమే నామినేట్ చేయాలని, కానీ వాళ్లు మాత్రం పార్టీ సభ్యుడివి అన్న సాకుతో దాని గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పైగా 'సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని' కూడా అనటం గమనార్హం.