
నంధ్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజయం తర్వాత.. తెదేపా.. వైసీపీపై మైండ్ గేమ్ స్పీడ్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఎవరా ఎమ్మెల్యేలు అన్నది మాత్రం అధికార పార్టీ నేతలు చెప్పడం లేదు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం వారి వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు. తాము ఆ పార్టీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు.. కావలనే అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వాపోతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ చెబుతున్నదంతా అబద్ధమని మొత్తుకుంటున్నా.. టీడీపీ మాత్రం తన వెనక్కి తగ్గడం లేదు. మొన్నటికి మొన్న.. సీఎం కుమారుడు, మంత్రి లోకేష్ విజయనగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది తమ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఆయన అలా చెప్పారో లేదో.. మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా లోకేష్ మాటలకు వంతు పాడుతున్నారు.
టీడీపీలో చేరతామంటూ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పదే పదే తనకు ఫోన్ చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకే నేరుగా ఫోన్లు వస్తున్నాయని.. తనతోపాటు ఇతర టీడీపీ నేతలకు ఇదే రకమైన ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై అంతర్గత సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తుచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.
2019 ఎన్నికల లక్ష్యంగానే టీడీపీ ఈ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందని.. అందరూ వైసీపీ ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని ప్రచారం చేస్తే.. వారు నిజంగానే వచ్చి చేరతారనే భావనలో టీడీపీ ఉందని వైసీపీ నేతల వాదన. ఇప్పటికే దాదాపు 20మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.వారిలో 10మందికి మాత్రమే పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమని సమాచారం.మిగిలిన ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం లేదని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. వెళ్లిన వాళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక కొత్తగా ఆ పార్టీలో చేరడం వల్ల తమకేంటి లాభమని వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని సమాచారం.
ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటే.. ఏదైనా లాభం ఉంటనే చేస్తారు కదా? మరి ఎలాంటి లాభం లేకుండా ఎవరైనా పార్టీ ఎందుకు మారతారు?