
ఏపీ రాజధాని అమరావతిలో వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటన మూడో రోజుకి చేరుకుంది. పర్యటనలో భాగంగా వారు రైతులతో సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం కోసం సహాయం చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ని కోరిన సంగతి తెలిసిందే.అయితే.. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతుల వాదన మరోలా ఉంది. ఈ నేపథ్యంలో అసలు విషయం తెలుసుకునేందుకు బ్యాంక్ ప్రతినిధులు నిన్న పలు గ్రామాల్లో పర్యటించగా.. ఈ రోజు మరి కొన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు.
ప్రపంచ బ్యాంకు బృందానికి ఏపీ రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. మూడు పంటలు పండే భూములను లాక్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నిడమర్రులో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కారణంగా ఇప్పటికే భూమిని కోల్పోయిన, కోల్పోతున్న బాదితులు ఆ బృందానికి తమ బాధలు చెప్పుకున్నారు.
'మా దగ్గర నుంచి భూమిని బలవంతంగా తీసుకొని ఎకరాకు రూ.18లక్షలులు ఇచ్చి వారు మాత్రం రూ.50లక్షలకు అమ్ముకుంటున్నారు. బంగారంలాంటి పంటలు పండే భూములను నాశనం చేస్తున్నారు. మేం ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూములు ఇవ్వం. మౌలిక సదుపాయాలకు భూములు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని రైతులు చెప్పగా.. గతంలో నెలకు తమకు రూ.12వేలు గిట్టుబాటు అయ్యేదని, ఇప్పుడు మాత్రం నెలకు రూ.2,500మాత్రమే ఇస్తోందంటూ రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కొండవీటి వాగు, పెదలంక గ్రామాల్లో పర్యటించి.. రైతులతో సమావేశం కానున్నారు.