
చంద్రబాబునాయుడు తాజాగా నిర్మించుకున్న ఇంటిపై నానా రభస జరుగుతోంది. ఒకరు నిర్మించుకున్న ఇంటిపై మిగితా వాళ్ళు రభస చేయటమేంటో అర్ధం కావటం లేదు. ఇటువంటి రభసకు ప్రదాన కారణం మాత్రం టిడిపి నేతలే. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో నిర్మించుకున్న ఇల్లు గురించి టిడిపి విపరీతమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటిలో 70 గదులున్నాయన్నది. మూడు స్విమ్మింగ్ పూల్స్, నాలుగు ఎస్కలేటర్లు, నాలుగు సమావేశ మందిరాలు, ఐదు లిఫ్టులు...ఇలా చాలానే ప్రచారం చేసింది.
అప్పట్లో జగన్ ఇంటిపై తాను చేసిన ప్రచారమే ఇపుడు చంద్రబాబు మెడకు చుట్టుకున్నది. అప్పట్లో జగన్ పై ఆరోపణలు చేసిన వారెవరూ నేరుగా జగన్ ఇంట్లోకి తొంగి కూడా చూడలేదు. టిడిపికి బాగా అలవాటైన విద్య కాబట్టి గుడ్డకాల్చి మీదేసేసారు. చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియా కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే, అదే మీడియాను జగన్ ఇల్లు చూపిస్తాంరండని వైసీపీ నేతలు సవాలు చేస్తే మాత్రం మాట్లాడలేదు.
సీన్ కట్ చేస్తే, ఇపుడు అటువంటి ప్రచారమే చంద్రబాబు ఇంటిపై మొదలైంది. దానికితోడు గృహప్రవేశానికి చంద్రబాబు ఎవరినీ పిలవకపోవటం, అత్యంత గోప్యంగా కార్యక్రమాన్ని నిర్వహించటంతో ఏదో ఉందని ప్రచారం ఇంకా ఊపందుకున్నది. దానికితోడు మూడు రోజులుగా ఇది చంద్రబాబు ఇల్లంటూ కొన్ని ఫొటోలు వాట్సప్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్. అయితే, ఆ ఫొటోలు నిజం కాదని తెలిసిపోతోంది. కానీ నిజమైన ఫొటోలేవో విడుదల చేయనంత వరకూ ఆ ఫొటోలే ప్రచారంలో ఉంటాయి కదా? ప్రచారంలో ఉన్నది తప్పుడు ఫొటోలంటూ నెత్తి, నోరు మొత్తుకుంటున్న టిడిపి నేతల జగన్ ఇంటిపై మాత్రం తప్పుడు ప్రచారం ఎలా చేసారు? ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కదా?
తన ఇంటిపై జరుగుతున్న ప్రచారానికి స్పందించాల్సిన చంద్రబాబు మౌనంగా ఉంటే మధ్యలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారు. జగన్ ఇంటి ఫొటోలు బయటపెడితే, చంద్రబాబు ఇంటి ఫొటోలు కూడా బయటపెడతామంటూ సవాలు విసురుతున్నారు. విచిత్రంగా లేదు సోమిరెడ్డి సవాలు? ఇల్లేమో చంద్రబాబుది. సవాలు విసురుతున్నదేమో సోమిరెడ్డి. జగన్ ఇంటికి సంబంధించి రహస్యమేమీ లేదు. ఎందుకంటే, జగన్ ఇంట్లోనే సమావేశాలు నిర్వహిస్తున్నాడు. నేతలతో పాటు మీడియా కూడా ప్రతిరోజు హాజరవుతునే ఉంది. జగన్ ఇంట్లో ఇంకా రహస్యమెక్కడిది. ఎమన్నా గోప్యత ఉంది అంటే అది చంద్రబాబు ఇంటిపైనే. మీడియాను ఒకసారి పిలిపిస్తే ప్రచారం ఆగిపోతుంది కదా?