
మొబైల్ ఆపరేటర్లకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. మొట్టమొదటి సారిగి ఓ సెల్ కంపెనీకి చెందిన టవర్ ను వారం రోజుల్లో డిఆక్టివేట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. సెల్ టవర్ తొలగించాలంటూ కోర్టు ఇచ్చిన మొట్టమొదటి ఆదేశాలివే. ఎప్పటి నుండో సెల్ టవర్లు జనాలపై చెడు ప్రభావం చూపుతుందని, అటువంటిదేమీ లేదని ఎప్పటి నుండో వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలో సెల్ టవర్ల వల్ల ఆరోగ్యానికి హానికరమే అంటూ సుప్రింకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం ఆపరేటర్లకు ఊహించని దెబ్బే.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన హరీష్ చంద్ కు క్యాన్సర్ సోకింది. తనకు క్యాన్సర్ రావటానికి తన ఇంటికి సమీపంలోనే ఉన్న సెల్ టవరే కారణమంటూ హరీష్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అందుకు పంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అందచేసారు. దాంతో విషయాన్ని మొత్తం అధ్యయనం చేసిన కోర్టు హరీష్ వాదనతో ఏకీభవించినట్లుంది.
సెల్ టవర్ల వల్ల విడుదలయ్యే విద్యుదస్కాంత ధార్మికతకకు జనాలు గురి అవుతారన్న వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. దాంతో వారంలోగా సెల్ టవర్ ను తొలగించాలంటూ ఆదేశాలిచ్చింది. దేశమొంత్తం మీద అన్నీ కంపెనీలకు కలిపి 12 లక్షల టవర్లున్నాయి. కోర్టు తాజా ఆదేశాల నేపధ్యంలో మిగిలిన లక్షలాది టవర్ల పరిస్ధితి ఏమవుతుందోనంటూ మోబైల్ కంపెనీల యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. మిగిలిన టవర్లను కూడా తొలగించాల్సి వస్తే దేశంలోని కోట్లాది మొబైల్ ఫోన్లు మూగబోక తప్పదు.