జగన్ స్టిక్కర్లు షర్మిల, సునీత ఇళ్లకు అతికించే దమ్ముందా?: వంగళపూడి అనిత

Published : Apr 11, 2023, 04:26 PM ISTUpdated : Apr 11, 2023, 04:35 PM IST
జగన్ స్టిక్కర్లు షర్మిల, సునీత ఇళ్లకు అతికించే దమ్ముందా?: వంగళపూడి అనిత

సారాంశం

ఏపీలో కొనసాగుతున్న 'జగనన్నే మా భవిష్యత్' కార్యక్రమంలో వాలంటీర్లను ఉపయోగించడంపై టిడిపి మహిళా విభాగం నాయకురాలు వంగలపూడి అనిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. 

అమరావతి : అధికార వైసిపి చేపట్టిన 'జగనన్నే మా భవిష్యత్' కార్యక్రమంపై తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేసారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న వాలంటీర్లు రాజకీయ పార్టీకి ప్రచారం చేసే కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. వైసిపి నేతలతో కలిసి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జగన్ ఫోటోలతో కూడిన స్టిక్కర్లు అంటించడం నేరమేనని అన్నారు. ఏపీ ప్రివెన్షన్ యాక్ట్ 1997ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని... దీన్ని అతిక్రమించి వాలంటీర్లు వైసిపి కార్యక్రమంలో పాల్గొంటున్నారని అనిత ఆరోపించారు. 

జగన్ బొమ్మతో ముద్రించిన స్టిక్కర్లు ఆయన చెల్లెల్లు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఇళ్ల గోడలకు అంటించే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి వుందా? అని అనిత ప్రశ్నించారు. సొంత చెల్లెల్ల ఇంటికి జగన్ స్టిక్కర్లు అంటించాకే ప్రజల ఇళ్లకు అంటించాలని అన్నారు. సొంత కుటుంబసభ్యులే జగన్ ను నమ్మకుంటే ప్రజలెలా నమ్ముతారు? అలాంటప్పుడు జగన్ ప్రజల భవిష్యత్ ఎలా అవుతాడు? అని అనిత ప్రశ్నించారు. 

జగన్ ఎన్ని బటన్లు నొక్కినా ప్రజలు నమ్మడం లేదు.. అందువల్లే వైసిపి నేతలు, వాలంటీర్లకు సంచులిచ్చి ఇంటింటికి పంపిస్తున్నారని అనిత అన్నారు. ఇలా ప్రజల సొమ్ముతో ముద్రించిన స్టిక్కర్లు ప్రజల గోడలపై అంటించేందుకు ప్రజా సొమ్మునే జగన్ ఖర్చు చేస్తున్నాడని అన్నారు. కేవలం స్టిక్కర్లు అతికించడం కాదు ఎంతమంది ఆ స్టిక్కర్లను అలాగే ఉంచుతున్నారో పరిశీలించాలని అనిత సూచించారు. 

Read More  తల్లికి లైంగిక వేధింపులు.. అందుకే వివేకాను సునీల్ యాదవ్ చంపాడు : భాస్కర్ రెడ్డి తరపు లాయర్ సంచలనం

ప్రజలకు ఇష్టంలేకుండా వారిఇళ్లకు ఎలాంటి పోస్టర్లు, స్టిక్కర్లు అంటించకూడదు... కానీ వైసిపి నాయకులు ఎవరి అనుమతీ లేకుండానే ఇష్టమొచ్చిన చోట స్టిక్కర్లు అతికిస్తున్నారని అనిత అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్థానంలో జగన్ స్వామ్యం నడుస్తోందని... ప్రభుత్వ ఉద్యోగులైన వాలంటీర్లు ప్రభుత్వచట్టాలకు విరుద్ధంగా ఈ జగన్ స్వామ్యాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. స్టిక్కర్ల అంటించడం వంటి దిక్కుమాలిన పనులు చేయడంద్వారా జైలుశిక్షలు అనుభవించాల్సి రావచ్చు అంటూ వాలంటీర్లకు అనిత హెచ్చరించారు. 
 
ఇక వైసిపి మాదిరిగా ప్రజల్లోకి వెళ్లే ధైర్యం టిడిపి నాయకులకు వుందా అంటూ మంత్రి రోజా చేసిన సవాల్ పై అనిత స్పందించారు. రోజా సవాల్ ను స్వీకరిస్తున్నామని... ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను, ఎవరికి ప్రజల్లోకి వెళ్లడానికి భయమే తేల్చుకుంటానని అనిత తెలిపారు. టీడీపీపై, చంద్రబాబుపై సవాళ్లు చేసేముందు రోజా సొంత నియోజకవర్గం నగరి ప్రజలకు కనిపిస్తే వారే సమాధానం చెబుతారన్నారు.టీడీపీకి ప్రజల్లోకి వెళ్లేధైర్యం లేదంటున్న రోజా విసిరిన సవాల్ కు తాము సిద్ధం... పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా సీఎం జగన్ గానీ, రోజాగానీ ప్రజల్లోకి వెళ్లగలరా? అని అనిత నిలదీసారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!