సిఐడి వద్దకు వెళ్లను... వాళ్లనే నాా దగ్గరకు రమ్మనండి..: హైకోర్టును కోరిన నారాయణ

By Arun Kumar PFirst Published Oct 3, 2023, 12:56 PM IST
Highlights

అక్టోబర్ 4న సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందాయని... తాను మాత్రం ఈ విచారణకు హాజరుకాబోనని ఏపీ హైకోర్టుకు తెలిపారు మాజీ మంత్రి నారాయణ. 

అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచారణకు హాజరుకాలేనంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి నారాయణ. అక్టోబర్ 4న విచారణకు హాజరుకావాలంటూ మాజీ మంత్రులు నారా లోకేష్, నారాయణ లకు సిఐడి నోటీసులు అందించిన విషయం తెలిసిందే. అయితే సిఐడి విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు నేతలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. 

అరవయ్యేళ్ళ వయసులో వున్న తనను సిఐడి కార్యాలయంలో కాకుండా ఇంటివద్దే విచారించాల్సిందిగా సిఐడిని ఆదేశించాలని హైకోర్టును నారాయణ కోరారు. రేపు(బుధవారం) ఉదయం తాడేపల్లిలోని తమ కార్యాలయానికి రావాల్సిందిగా సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారని... కానీ తాను హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు మాజీ మంత్రి. తనకు నాలుగైదు రోజులు గడువు ఇవ్వాలని... ఆ తర్వాతే విచారణ చేపట్టాలని సిఐడిని ఆదేశించాలని నారాయణ ఏపీ హైకోర్టును కోరారు.

Latest Videos

ఇదిలావుంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరుకావాలంటూ లోకేష్ కు కూడా సిఐడి నోటీసులు అందించింది. అయితే ఈ నోటీసుల్లో హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన తీర్మానాలు, అకౌంట్ పుస్తకాలు తీసుకురావాలని ఆ నోటీసులో సిఐడి కోరింది. దీనిపై  అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ హైకోర్టుకు వెళ్లారు. హెరిటేజ్ ఫుడ్స్ నుండి తాను ఎప్పుడో బయటకు వచ్చేసానని... అలాంటిది ఆ సంస్థకు చెందిన  తీర్మానాలు,  అకౌంట్ బుక్స్ ను ఎలా తీసుకు రాగలనని అన్నారు. 

Read More  అమరావతి అసైన్డ్ భూముల కేసు: మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ మరో రెండు వారాల పొడిగింపు

ఇక ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుతో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని  లోకేష్ పేర్కొన్నారు.ఈ కేసులో తన పేరును చేర్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.సంబంధం లేని అంశంపై కేసు నమోదు చేసి  అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.2017లో తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టానని... ఏపీ ఫైబర్ గ్రిడ్  ప్రాజెక్టును  2014లో ప్రారంభించినట్లు తెలిపారు. అయినా తాను చేపట్టిన పంచాయితీరాజ్, ఐటీ శాఖలకు ఏపీ ఫైబర్ గ్రిడ్ కు ఎలాంటి సంబంధం లేదని  ఆ పిటిషన్ లో లోకేష్  ప్రస్తావించారు.

టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను మార్చారని వైసీపీ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
 
ఈ కేసులో నారా లోకేష్‌ను ఏ14గా పేర్కొంటూ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో సెప్టెంబర్‌ 26న ఏపీ  సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో కొంత మందికి లబ్ధి చేకూరేలా మార్పులు చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్‌ కుటుంబానికి లోకేష్ సాయం చేశారనే ఆరోపణలు  ఉన్నాయి. ఈ కేసులో లింగమనేని రమేష్‌ ఏ3గా ఉన్నారు.


 

 

 

click me!