తల్లిని ఓడించారని విశాఖపై జగన్ కక్ష: లోకేష్

Published : Feb 14, 2021, 01:37 PM IST
తల్లిని ఓడించారని విశాఖపై జగన్ కక్ష: లోకేష్

సారాంశం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలోని వైఎస్ఆర్‌సీపీ సర్కార్ రహస్య ఒప్పందం చేసుకొందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.   

విశాఖపట్టణం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలోని వైఎస్ఆర్‌సీపీ సర్కార్ రహస్య ఒప్పందం చేసుకొందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ  గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరహారదీక్షకు ఆదివారం నాడు లోకేష్ సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

2014లో  తల్లిని ఓడించారనే కక్షతో విశాఖపట్టణంపై జగన్ కక్షగట్టారన్నారు. జగన్ వస్తే ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. అంతేకాదు పేదలకు ఇల్లు కూడ లేకుండాపోయయాని ఆయన విమర్శించారు.పోస్కో వస్తోందని తాము కూడ సంతోషించామన్నారు. కొత్త ఫ్యాక్టరీ పెట్టకుండా ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీననే పోస్కోకు అప్పగించే కుట్ర దాగుందని ఇటీవలనే  తేలిందన్నారు.

మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ .. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను మర్చిపోయాడని ఆయన విమర్శించారు. అనేక ఐటీ పరిశ్రమలను విశాఖపట్టణానికి తాను మంత్రిగా తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కనీసం ఒక్క కొత్త ఫ్యాక్టరీని జగన్ సర్కార్ తీసుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు.ఆదివారం నాడైతే విశాఖ ప్రజలు భయంతో వణికిపోతున్నారన్నారు. ఎప్పుడు ఏ ఇంటిని కూల్చివేస్తారోననే భయం విశాఖ వాసుల్లో ఉందని ఆయన చెప్పారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భూములను కొట్టేసేందుకు గాను జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేష్ ఆరోపించారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతుందన్నారు.

ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుతామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేని  జగన్ సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాగలదా అని లోకేష్ ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్