కర్నూల్ రోడ్డు ప్రమాదం... మృతులకు రెండు, క్షతగాత్రులకు లక్ష రూపాయలు

By Arun Kumar P  |  First Published Feb 14, 2021, 1:12 PM IST

కర్నూల్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అంతేకాకుండా క్షతగాత్రులకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు జగన్. 


అమరావతి: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు వైసిపి ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అంతేకాకుండా క్షతగాత్రులకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు జగన్. 

దైవదర్శనానికి వెళూతూ రోడ్డు ప్రమాదానికి గురయి 14మంది మృత్యువాతపడిన విషాద సంఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళుతున్న టెంపో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. మంచి స్పీడ్ లో వున్న వాహనాన్ని అదుపుచేయడం డ్రైవర్ కు సాధ్యంకాకపోవడంతో అదికాస్తా డివైడర్‌ పైనుండి రోడ్డుకు అవతలివైపుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న ఓ లారీని ఢీకొట్టింది.  

read more    కర్నూల్ రోడ్డు ప్రమాదం: డివైడర్ పైనుంచి ఎగిరి లారీని ఢీకొన్న టెంపో

ఈ ప్రమాద సమయంలో టెంపోలో దైవదర్శనానికి వెళుతున్న ఒకే కుటుంబానికి చెంది న 18మంది వున్నారు. వీరితో 14మంది సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రగాయాలపాలయి సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాలపాలైన నలుగురూ చిన్నారులే. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు.

వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. దీంతో పోలీసులు క్రేన్‌ సాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయాలతో బయటపడిన నలుగురు చిన్నారులు మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

click me!