ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరారు.
అమరావతి: కరోనా సామాజికవ్యాప్తి మొదలైన ప్రమాదకరమైన దశలో లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా టెన్త్ పరీక్షలు రద్దుచేయాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.
తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తమ విద్యార్థులను కాపాడుకునేందుకు పరీక్షలు రద్దు చేశాయని ఆయన గుర్తు చేశారు. .ఏపీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనే విధంగా వ్యవహరించడం తగదని చెప్పారు.
కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి నేటి వరకూ జగన్ మాత్రం తాడేపల్లి గడప కూడా దాటి రావడంలేదని ఆయన అన్నారు. లక్షలాది మంది విద్యార్థులను మాత్రం పరీక్షల పేరుతో కరోనా కోరల్లోకి నెట్టేస్తున్నారని చెప్పారు. తక్షణమే పరీక్షల రద్దు ప్రకటించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని అన్నారు.