దళిత ప్రతిఘటన ర్యాలీ... మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు హౌస్ అరెస్ట్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 10, 2021, 11:55 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును విజయవాడలో దళిత ప్రతిఘటన ర్యాలీకి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 


గుంటూరు: దళితులపై కక్షగట్టి దమనకాండ సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వ మెడలు వంచి... దళితులకు న్యాయం చేసేందుకు అంటూ ఆగస్టు 10న దళిత ప్రతిఘటన ర్యాలీకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  విజయవాడ జింఖానా మైదానంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ఈ ప్రతిఘటన ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

ఇంట్లోంచి బయటకు వచ్చిన తనను అడ్డుకున్న పోలీసుల తీరుపట్ల ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు మాజీ మంత్రికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆనంద్ బాబు దళిత ప్రతిఘటన ర్యాలీకి వెళ్లలేకపోయారు.  

వీడియో

ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ... దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవాలని చూస్తోందంటూ వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. దళితులు, ఎస్టీలు, మైనారిటీ ఓట్లతోనే జగన్ అధికారంలోకి వచ్చాడని అన్నారు. ఇలా ఓట్లు వేసి గెలిపించిన దళిత మైనారిటీలపైనే ఇప్పుడు జగన్ ఉక్కుపాదం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  దళితులపై జగన్ సర్కార్ దమనకాండ... విజయవాడలో ప్రతిఘటన ర్యాలీ: మాజీ మంత్రి ప్రకటన

''భారతదేశంలో ఎక్కడా లేని విదంగా ఏపిలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. శిరోముండనాలను జగన్ ప్రభుత్వం మరల  ప్రవేశ పెట్టింది. దళితుల రక్షణ కోసం తీసుకువచ్చిన అట్రాసిటి కేసులను వారిపైనే పెడుతున్నారు. రాజ్యాంగం దళితులకు  కల్పించిన హక్కులను జగన్ కాలరాస్తున్నాడు'' అని ఆరోపించారు. 

''దళితులపై జగన్ కక్ష్య కట్టినట్లుగా పాలన చేస్తున్నాడు. జగన్ ప్రభుత్వానికి ఇదే నా సవాల్... దమ్ముంటే దళితుల అభివృద్ధిపై చర్చకు రావాలి'' అని ఆనంద్ బాబు జగన్ సర్కార్ కు సవాల్ విసిరారు. 


 

click me!