నేటితరం గాంధారి విజయమ్మ... తాడేపల్లి దుర్యోధనుడిలా జగన్: పట్టాభిరాం సంచలనం

By Arun Kumar PFirst Published Apr 6, 2021, 3:58 PM IST
Highlights

వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ అవసరం లేదని జగన్ బాబు పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నాడో విజయమ్మ చెప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. 

విజయవాడ: పురాణాల్లో ఆనాటి గాంధారి, దుర్యోధనుణ్ణి మంచివాడిగా భావించి కళ్లకు గంతలు కట్టుకొని జీవిస్తే నేటి గాంధారి అయిన విజయమ్మ తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, దుర్మార్గాలు చూడలేకనే లేఖలు రాస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. జగన్ బాబుని ప్రజలంతా కిలాడి బాబు, క్రిమినల్ బాబు అని పిలుచుకుంటున్నారని ఆమె తెలుసుకోవాలన్నారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై జరుగుతున్న ప్రచారంపై విజయమ్మ మీడియాకు ఐదు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ లేఖపై స్పందిస్తూ విజయమ్మకు కొమ్మారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ అవసరం లేదని జగన్ బాబు పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నాడో విజయమ్మ చెప్పాలన్నారు. చిన్నాన్నను చంపినవారెవరో తేలకుండానే పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకుంటున్నావని ఆమె జగన్ బాబుని ఎందుకు అడగలేదు?  అని ప్రశ్నించారు. 

''వివేకానందరెడ్డి కూతురు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్ విజయమ్మ చదివారా? సునీత తన పిటిషన్ లోని పేజీ నెం-17లో వివేకానందరెడ్డి హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నాటి ప్రభుత్వం, ప్రత్యేకాధికారితో సిట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పారదర్శకమైన విచారణ కోసం అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ నేత్రుత్వంలో నాటి టీడీపీ ప్రభుత్వం నియమించినట్టు సునీత తన పిటిషన్ లో చెప్పారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రైన రెండువారాలకే  సిట్ అధికారిని మార్చేశాడని సునీత తన పిటిషన్ లోని పేజీనెం-18లో చెప్పారు. దోషులను కాపాడేందుకే జగన్ బాబు సిట్ బృందాన్ని మార్చాడని విజయమ్మకి తెలియదా?'' అని నిలదీశారు. 

''జగన్ ప్రభుత్వం పదేపదే సిట్ బృందంలోని సభ్యులను మారుస్తున్నారంటూ సునీత తన పిటిషన్ పేజీ నెం-24లో చెప్పలేదా? జగన్ బాబుకి ముఖ్యమంత్రయ్యాక ఏ పనిలేక సిట్ ను మార్చాడా?    వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర రెడ్డిల పేర్లని విజయమ్మ తనలేఖలో ఎందుకు ప్రస్తావించలేదు? వారు తనకళ్లముందే తిరుగుతున్నా, వారికి ఢిల్లీలో పదవులిచ్చి మరీ చోద్యం చూస్తున్నారు. వివేకా హత్యకేసులో ప్రధాన సాక్షి అయిన శ్రీనివాస రెడ్డిది హత్యో, ఆత్మహత్యో విజయమ్మకు తెలియదా?'' అని అడిగారు. 

read more   వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో నిజాలు నిగ్గు తేలాల్సిందే: విజయమ్మ బహిరంగ లేఖ

''జగన్ బాబు మూడోసారి సిట్ ను నియమించింది వాస్తవం కాదా? శ్రీనివాసరెడ్డి హత్య జరిగిన వెంటనే సిట్ కు అధిపతిగా ఉన్న అభిషేక్ మహంతి ఎందుకు లాంగ్ లీవ్ పై వెళ్లారు? వాస్తవాలు బయటకొస్తాయని అభిషేక్ మహంతిని జగన్ బాబే తోలేశాడా? చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేస్తూ ఏముఖం పెట్టుకొని విజయమ్మ బహిరంగ లేఖలు రాస్తున్నారు'' అంటూ మండిపడ్డారు. 

''జగన్ బాబు ప్రభుత్వంలో తనకు రక్షణలేదంటూ, భద్రత కావాలంటూ సునీతమ్మ డీజీపీకి లేఖ రాసింది నిజం కాదా? వైఎస్ విజయమ్మ తన లేఖలో రాసినట్టు వారి కుటుంబసభ్యుల మద్ధతంతా సునీతకు ఉందా? వారి మద్ధతు సంగతి దేవుడెరుగు... సాక్షి మీడియా మద్ధతు సునీతమ్మకు ఉందా? సునీతమ్మ ప్రెస్ మీట్ ను సాక్షి ఛానల్ లో ఎందుకు ప్రసారం చేయలేదో విజయమ్మ చెప్పాలి. సునీతమ్మకు న్యాయం చేయాలని, వివేకా హత్యకేసు దోషులను పట్టుకోవాలని ఏనాడైనా సాక్షిపత్రికలో రాశారా? ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపించే జగన్ బాబు సునీత కోసం  ఒక్కలాయర్ని కూడా ఎందుకు నియమించలేదు?'' అని నిలదీశారు. 

''చంద్రబాబు ప్రభుత్వం కోడికత్తి కేసుని సరిగా విచారించలేదంటున్న విజయమ్మ తన కుమారుడు ముఖ్యమంత్రయ్యాక దానిపై ఎందుకు విచారణ జరిపించలేదో సమాధానం చెప్పాలి. విశాఖపట్నంలో వైద్యులే లేనట్లు కోడికత్తి ఘటన జరిగిన వెంటనే జగన్ బాబు హైదరాబాద్ కు ఎందుకు పారిపోయాడు? ఏపీలో డాక్టర్లే లేనట్టు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏపీ మెడికల్ కౌన్సిల్  ఛైర్మన్ గా డాక్టర్ శివారెడ్డి, ఏపీఎంఎస్ ఐడీసీ ఛైర్మన్ గా డాక్టర్ బీ.చంద్రశేఖర్ రెడ్డిలను నియమించడమేంటి? కోడికత్తి డ్రామాలో బాగా నటించారని వారికి జగన్ బాబు పదవులిచ్చాడా? ఇన్ని వాస్తవాలు కళ్లముందు కనిపిస్తుంటే నేటి గాంధారి, టీడీపీపై నిందలేస్తూ లేఖలు రాయడమేంటి?'' అంటూ ఎద్దేవా చేశఆరు. 

''తన బిడ్డల మధ్య ఉన్న విబేధాలను కప్పిపుచ్చేందుకే విజయమ్మ లేఖలు రాస్తోంది. చిన్నాన్నను హత్యచేసిన వారిని కాపాడుతూ సొం తచెల్లెళ్లకే జగన్ బాబు ఎలా వెన్నుపోటు పొడిచాడో ప్రజలకు అర్థమైందని విజయమ్మ గ్రహించాలి. విజయమ్మ ఇదేవిధంగా తన బాబుని భుజానికెత్తుకునే ప్రయత్నం చేస్తే ఆమె అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. విజయమ్మ తనకళ్లగంతలు తీసేస్తే తాడేపల్లి దుర్యోధనుడి అసలు రూపం కనిపిస్తుంది. సునీత పిటిషన్ చదివితే నేటి గాంధారి విజయమ్మకు అసలు వాస్తవాలు బోధపడతాయి'' అని కొమ్మారెడ్డి పట్టాభిరాం సూచించారు. 

click me!