కేసీఆర్ వద్దంటే జగన్ కావాలంటున్నాడు.. ఎందుకోసమో?: నిలదీసిన మాజీ మంత్రి

By Arun Kumar PFirst Published Sep 3, 2020, 10:04 PM IST
Highlights

ఆవు తోలు కప్పుకున్న పులే ఇప్పుడు వైసిపి ప్రభుత్వం అమలు చేయాలని అనుకుంటున్న నగదు బదిలీ పథకమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. 

పక్కరాష్ట్రం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించిన నగదు బదిలీని జగన్ ఎందుకు చేపట్టారు? అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఆవు తోలు కప్పుకున్న పులే ఇప్పుడు వైసిపి ప్రభుత్వం అమలు చేయాలని అనుకుంటున్న నగదు బదిలీ పథకమని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 

''అవినీతి స్కీముల కోసం అతిగా అప్పులు చేయడానికే నగదు బదిలీ పథకాన్ని చేపట్టారు. ఇది రైతులు, దళిత, బలహీన వర్గాలను నిండా ముంచగలదు. అందుకే దేశంలో అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని తిరస్కరించాయి. అవినీతి, దుబారా తగ్గించుకుంటే ఇప్పుడు వస్తున్న ఆదాయంతోనే జీతాలతో పాటు పథకాలన్నీ సజావుగా నడపవచ్చు. 2020-21 మొదటి క్వార్టర్ కాగ్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది'' అని తెలిపారు. 

''2020 జూన్ నెలలో కరోనా ఉన్నా రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 5,785 కోట్లు వచ్చింది. ఇది 2018-19 లో చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ. చంద్రబాబు ఏడాదికి సరాసరి రూ.26 వేల కోట్లు అప్పు చేస్తే జగన్ రూ.63 వేల కోట్లు అప్పు చేశారు. వీటితోనే జీతాలతో సహా అన్ని స్కీములు సజావుగా నడపవచ్చు.  మరింత ఎక్కువగా అప్పు చేయడానికి జగన్ ప్రభుత్వం ఊరకలు వేస్తున్నది. దీని కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడవబోతున్నది'' అని ఆరోపించారు. 

''పేదలు, రైతులకు వ్యతిరేకమైన నగదు బదిలీ పథకానికి ఆవు తోలు కప్పే ప్రచారం చేస్తున్నారు. ఆవు తోలు కప్పుకున్న పులి నగదు బదిలీ పథకం. ఈ నగదు బదిలీని సీఎం పొగడడమే కాక తెలుగుదేశంపై అబద్దపు ప్రచారానికి దిగారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  దళిత యువతి ఇంటికి నిప్పు...నిందితుడు సాయిరెడ్డికి వైసిపి అండ: అనురాధ

''2014లో 22.5 మిలియన్  యూనిట్ల లోటుతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. రోజుకు 10 గంటలకు పైగా కరంటు కోతలు ఉండేవి. అంతేగాక గత ప్రభుత్వ బాకాయిలు రూ.32వేల కోట్ల కట్టాల్సి వచ్చింది. ఇందులో విద్యుత్ బకాయిలు రూ.8 వేల కోట్లుకు పైగా చెల్లించాల్సి వచ్చింది.  ఈ బకాయిలు అన్ని తీర్చి మరో రూ.36 వేల కోట్లు విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టి అదనంగా మరో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి కరెంటు కోతలు లేకుండా చేసింది చంద్రబాబు ప్రభుత్వంమే'' అని తెలిపారు. 

''అలాగే ఐదేళ్ళలో 900 యూనిట్లు వాడే వారికి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. జగన్ రెడ్డి చేతిలో మిగులు విద్యుత్ ను పెట్టడం జరిగింది. రూ. 40 వేల కోట్ల విద్యుత్ ఆస్థిని జగన్ చేతుల్లో పెట్టి కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే బకాయిలు ఇచ్చారు. ఇచ్చిన కొండంత ఆస్థి గురించి చెప్పకుండా గోరంత అప్పుని కొండంతగా దుష్ప్రచారం చేస్తూ తమ నగదు బదిలీ పథకంలోని మోసాన్ని కప్పి పెట్టుకునే కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''పంపుసెట్లును అధికంగా రాయలసీమలో ఉపయోగిస్తారని... ఈ నగదుబదిలీని ప్రవేశపెట్టడం వల్ల రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది రాయలసీమకు అన్యాయం చేయడమే'' అని మండిపడ్డారు. 

''చంద్రబాబు రైతుకు సోలార్ పంప్ సెట్ పథకం ఇచ్చారు. లక్షల రూపాయిల సబ్సిడీ ఇచ్చారు.  రైతు అవసరం పోగా మిగులు విద్యుత్ గ్రిడ్ కు అమ్మి లాభం పొందే అవకాశం కల్పించారు.  నేడు జగన్ 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ పేరుతో రూ. 2 వేల కోట్లు కమీషన్ కొట్టేయడానికి పథకం వేశారు.  ఇలాంటి అవినీతి పథకాలకు మితిమీరి అప్పు చేసేందుకే నగదు బదిలీ పథకానికి అంగీకరించి రైతు ఆత్మహత్యలు పెరిగే విధంగా చేస్తున్నారు.  రైతుల్ని, పేదల్ని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. కరోనా పేరు చెప్పి అవినీతి తారా స్థాయిలో చేస్తున్న వైకాపా కుట్రలను ఎండగట్టాలి.  రాష్ట్రాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవాలి'' అని కాలవ శ్రీనివాసులు అన్నారు. 

click me!