పోలీసా .. వైసీపీ ఏజెంటా, భీమవరం టికెట్‌ ఆయనకే : తాడిపత్రి డీఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు

By Siva KodatiFirst Published Dec 23, 2022, 2:30 PM IST
Highlights

తాడిపత్రి డీఎస్పీపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డీఎస్పీ తన కార్యాలయాన్ని వైసీపీ ఆఫీస్‌గా మార్చేశారని.. పెద్దారెడ్డి ఏం చెబితే అది చేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 

తాడిపత్రి డీఎస్పీపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఏజెంట్‌గా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీలు ఇసుక వ్యాపారంలో పార్ట్‌నర్‌లని జేసీ ఆరోపించారు. డీఎస్పీ తన కార్యాలయాన్ని వైసీపీ ఆఫీస్‌గా మార్చేశారని.. పెద్దారెడ్డి ఏం చెబితే అది చేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తనపై 59 కేసులు పెట్టారని.. తన అనుచరులు 861 మందిపై 307 వంటి కేసులు నమోదు చేశారని జేసీ దుయ్యబట్టారు. తాడిపత్రిలోని ప్రస్తుత పరిస్ధితులపై తాను ముందు నుంచి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని, చివరికి డీఐజీ అసలు నిజాలు చెప్పారని ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాడిపత్రి డీఎస్పీ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 

ఇదిలావుండగా... ఈ నెల ప్రారంభంలో జేసీ ప్రభాకర్ రెడ్డి బిక్షాటనకు వెళ్లేందుకు  ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన నివాసం వద్దే ఆయన బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసుల తీరును జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుబట్టారు. మున్సిపాలిటీలో వాహనాల మరమ్మత్తులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది. దీంతో  వాహనాల మరమ్మత్తులకు అవసరమైన నిధుల కోసం భిక్షాటన చేయాలని  జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో  భిక్షాటనకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని  పోలీసుల జేసీ  ప్రభాకర్ రెడ్డిని నిలువరించారు. 

Also REad: ఎస్పీనా .. వైసీపీ జిల్లా అధ్యక్షుడా , వాళ్ల కంటే ఓవర్ చేస్తున్నాడు : పల్నాడు ఎస్పీపై బోండా ఉమా ఫైర్

ఇకపోతే... గత శుక్రవారం మాచర్లలో చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాచర్ల టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి పల్నాడు వైసీపీకీ అధ్యక్షుడిలా పనిచేస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. వైసీపీ ఇంకా ఎన్నో రోజులు అధికారంలో వుండదని ఎస్పీ గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేత కంటే ఎక్కువ చేస్తున్న ఎస్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. టీడీపీ నేతల ఇళ్లు, కార్లు తగులబెడితే కేసులు పెట్టకుండా వారిని కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. 

అటు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ , ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు నేతలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల ఘటనకు సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మాచర్లలో భయనక పరిస్థితిని తీసుకోస్తున్నారని, వైసిపి అరిపోయే దీపమని యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 

click me!