ముగిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణ... 12 గంటల పాటు ప్రశ్నల వర్షం

By Siva KodatiFirst Published Oct 8, 2022, 9:22 PM IST
Highlights

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. దాదాపు 12 గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. దాదాపు 12 గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్ కేసు, రవాణా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి నుంచి అధికారులు వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇక, ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు శుక్రవారం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను విచారించిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా రెండో రోజు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు. 

స్క్రాప్‌ వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్‌, నడపటం, కొన్ని చట్టాలను ఉల్లంఘించి విక్రయించడంపై ఈడీ అధికారులు ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. 2017 ఏప్రిల్ 1 తర్వాత బీఎస్ 3 వాహనాల అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. అనేక చట్టాలను ఉల్లంఘించి కొన్ని వాహనాలను విక్రయించారనే ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు.  

ALso REad:ముగిసిన ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ... బాగా చూసుకున్నారన్న జేసీ

ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బీఎస్ 3 ప్రమాణాలు కలిగిన వాహనాలను అక్రమంగా బీఎస్ 4 వాహనాలుగా మార్చుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతుంది. 

ఇదిలా ఉంటే.. శుక్రవారం విచారణ అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు తనతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించారని చెప్పారు. తాను ఏజెన్సీ అధికారులకు సహకరించానని తెలిపారు. ఈడీ అధికారుల ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని చెప్పారు. తాను మనీ లాండరింగ్‌కు పాల్పడలేదని .. ఏపీ సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నేను క్లీన్‌గా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు... మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తనకు ఈడీ సమన్లు పంపిందనే వార్తలను ప్రభాకర్ రెడ్డి ఖండించారు. ఈడీ ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని, దర్యాప్తులో ఏజెన్సీకి సహకరిస్తానని అన్నారు.

 

click me!