ఏపీలో రాజుకుంటున్న ధాన్యం కొనుగోలు వివాదం...అన్నదాతలతో కలిసి ధూళిపాళ్ల ఆందోళన (Video)

By Arun Kumar PFirst Published Dec 28, 2021, 5:26 PM IST
Highlights

తెెలంగాణలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు వివాదం తారాస్థాయికి చేరుకుంటే ఏపీలో ఇప్పుడిప్పుడే వివాదం రాజుకుంటోంది. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆందోళనకు దిగాడు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ (andhra pradesh) ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు (RBK) దోపిడి కేంద్రాలుగా మారాయని టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (dhulipalla narendra kumar) ఆరోపించారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నట్లుగా వైసిపి (ysrcp) పాలన సాగుతోందని... జగన్ సర్కార్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. అన్నదాతలు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసేవరకు రైతుల తరపున  పోరాడతానని ధూళిపాళ్ల స్పష్టం చేసారు. 

గుంటూరు జిల్లా (guntur district) పొన్నూరు మండలం మునిపల్లె గ్రామంలోని ఆర్బికె (రైతు భరోసా కేంద్రం) సెంటర్ వద్ద రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ధూళిపాళ్ళ పాల్గొన్నారు. ధాన్యాన్ని రోడ్డుపై కుప్పగా పోసి దాని ముందే కూర్చుని ధర్నాకు దిగారు. 

Video

ఈ సందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు (paddy procurement) కేంద్రాల పేరుతో రైతు భరోసా కేంద్రాలు దోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. పొన్నూరు (ponnuru) నియోజకవర్గంలో నేటివరకు ఒక్క రైతు నుంచి కూడా ధాన్యం కొనుగోలు జరపలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు పేరిట వైసిపి నాయకులు తక్కువ ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి మద్దతు ధరకు ప్రభుత్వానికి విక్రయించి జేబులు నింపుకుంటున్నారని... జొన్న, మొక్కజొన్న కొనుగోలులో జరిగిన అవినీతి అందుకు ఒక ఉదాహరణ అని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 

read more  వైసీపీ అరాచక పాలనపై సరైన సమయంలో కేంద్రం నిర్ణయం: సుజనా చౌదరి సంచలనం

''పొన్నూరు నియోజకవర్గంలో మునిపల్లె గ్రామంలో 900 పైబడి రైతులు ఉంటే కేవలం 27 మంది రైతుల నుంచి మాత్రమే ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు శాంపిల్ సేకరించారు. దీంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.  కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం తో రైతులు అయినకాడికి పంటను తెగనమ్ముకుంటున్నారు.   రైతు కష్టాలను చూస్తే ఎంతో ఆవేదన కలుగుతుంది'' అని ధూళిపాళ్ల పేర్కొన్నారు. 

''ఈ వైసిపి ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు తప్ప రైతులకు చేసింది శూన్యం. అందుకే ప్రతి రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేసే వరకు తెలుగుదేశం పార్టీ (TDP) ఆర్బికే ల వద్ద ఉద్యమిస్తూనే ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా  రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలి'' అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల డిమాండ్ చేసారు. 

ఇదిలావుంటే తెలంగాణ (telangana)లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బిజెపి (BJP), రాష్ట్ర టీఆర్ఎస్ (trs) ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే తెలంగాణ రైతుల కోసమో లేక టీఆర్ఎస్ ఆందోళనతోనో కాస్త దిగివచ్చిన కేంద్రం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనున్నట్లు ప్రకటించింది.  ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ నుండి సేకరించనుంది కేంద్రం. 

 

click me!