
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అవినాశ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథానే అని.. నేరం జరిగిన స్థలంలో ఆధారాలను చెరపకూడదనే విషయం తండ్రీకొడుకులకు తెలియదా అని బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు.
వివేకా హత్య జరిగిన స్థలానికి పోలీసులు రాకుండానే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారని ఆయన ఆరోపించారు. వివేకాను హత్య చేసిన తర్వాత రక్తాన్ని కడిగి, మృతదేహానికి కుట్లు వేసింది ఎవరో చెప్పాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలని బండారు డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు అలుపెరగకుండా పనిచేస్తున్నారని బండారు సత్యనారాయణ మూర్తి ప్రశంసించారు.
Also Read: వైఎస్ అవినాష్ రెడ్డికి ట్విస్టిచ్చిన సునీతారెడ్డి:: మధ్యంతర బెయిల్ పై సుప్రీంలో పిటిషన్
ఇకపోతే.. వివేకా కేసులో ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై ఈ నెల 25న తుది తీర్పును ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ను ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ పిటిషన్ ను రేపు విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది.