
మంగళగిరి: విశాఖపట్నం జిల్లా (visakhapatnam district)లో ఓ పోలీస్ పై అధికార పార్టీ ఎంపిటిసి భర్త, విద్యాకమిటీ ఛైర్మన్ దౌర్జన్యానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇలా గ్రామస్థాయి నేతలు పోలీసుతో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించిన ఘటనపై తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) స్పందించారు. అటు వైసిపి నేతలు, ఇటు పోలీసులకు చురకలు అంటిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
''ఏపీ పోలీసులని (AP Police) చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది. ఓవైపు తమపై వైసీపీ (ycp) దాడులు చేస్తున్నా వారి అరాచకాలకి కొమ్ముకాస్తూనే వున్నారు ఖాకీలు. ప్రభుత్వ తొత్తులుగా మారి ప్రశ్నించే ప్రజలు-ప్రతిపక్ష టిడిపిపై దాడులకీ తెగబడ్డారు. ఇన్ని చేసిన కొంతమంది పోలీసులూ చివరికి వైసీపీ మూకల బాధితులవుతున్నారు'' అని లోకేష్ అన్నారు.
''విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండి పై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం బరితెగింపుని వెల్లడిస్తోంది. సీఐపై మంత్రి చీదర పని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై ఎంపీ సురేష్ రౌడీ మూకల దాడి... పోలీసులకే రక్షణలేని రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేదెవరు?'' అని లోకేష్ ప్రశ్నించారు.
విశాఖ జిల్లాలో వైసిపి నేతల వీరంగానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మాకవరపాలెం మండలకేంద్రంలోని ఆర్ఆర్ రెస్టారెంట్ లో మద్యంమత్తులో వివాదం చెలరేగడంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఓ పోలీస్ స్కూటీపై అక్కడికి చేరుకున్నాడు.
అయితే ఈ పోలీస్ కానిస్టేబుల్ తో పాకలపాడు వైసీపీ ఎంపీటిసి భర్త యళ్ల నాయుడు, గ్రామ విద్యా కమిటీ చైర్మన్ నానాజీ అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసన్న భయం గానీ, విధుల్లో వున్న ప్రభుత్వ ఉద్యోగి అన్న గౌరవం గానీ లేకుండా మద్యంమత్తులో వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనం సీటుపై బిర్యానీ, సోడా బాటిల్ పెట్టి పోలీస్ ముందే మద్యం బాటిల్ పగలకొట్టారు.
''మేము అధికారపార్టీ నేతలం... మాకు ఎమ్మెల్యే తెలుసు... మీరు మమ్మల్ని ఏమి చెయ్యలేరు'' అంటూ వైసిపి నాయకులు పోలీసుతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ వ్యవహారాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడది వైరల్ మారుతోంది.
ఇదిలావుంటే గత వారం అధికార వైసిపి ఎంపీ నందిగాం సురేష్ (nandigam suresh) తో పాటు ఆయన అనుచరులు విజయవాడ (vijayawada)లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి కృష్ణలంక పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవడమే ఎంపీ కోపానికి కారణమయ్యింది. ఇలా పోలీస్ స్టేషన్ కు తరలించిన యువకుల్లో సమీప బంధువు వుండటంతో ఎంపీ సురేష్ స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి అలజడి రేగింది.
తమవారిపై చేయిచేసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీ వెంట వచ్చిన అనుచరులు ఎస్సైతో పాటు ఇతర సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాదు బాహాబాహికి సిద్దమయ్యారు. ఈ తతంగాన్ని శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ సెల్ ఫోన్లో వీడియో తీయసాగాడు. ఇది చూసిన ఎంపీ అనుచరులు అతడి వద్దనుండి పోన్ లాక్కోవడమే కాదు దాడికి తెగబడ్డారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ లోని ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేసారు.