అవినీతి ఉన్న చోట అభివృద్ది జరగదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ హయంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గుంటూరు: అవినీతి ఉన్న చోట అభివృద్ది జరగదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అవినీతి లేని సమాజం కోసం పాటుపడాల్సి ఉందన్నారు.అవినీతి ఉన్నచోట అభివృద్ధి జరగదన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవాసులు కృషి చేయాలని పిలుపిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు ఆదర్శమని, మహత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచానికి స్ఫూర్తి అని, మన గౌరవం, ప్రతిష్ట పెరగాలంటే దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర్య వేడుకలు జనం మధ్యలో చేయాలనే ఇక్కడ ఏర్పాటు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా చేబ్రోలులో టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించాలని చంద్రబాబు కోరారు. లేకపోతే సమాజం విచ్చిన్నం అయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
undefined
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు.కరోనాను లెక్క చేయకుండా దేశానికి అన్నం పెట్టేందుకు రైతులు ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. కరోనా సమయంలో రైతులు దేశ ప్రజలకు అన్నం పెట్టేందుకు కరోనాను సైతం లెక్క చేయకుండా కృషి చేశారని చెప్పారు.
దేశ సమైక్యత విషయంలో టీడీపీ ఏనాడూ రాజీపడబోదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సంస్కరణల కారణంగానే అభివృద్ది సాధ్యమైందని ఆయన చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఐటీ రంగానకి పెద్దపీట వేయడం వల్ల దాని ఫలితాలు ఇప్పుడు కన్పిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. తాము తీసుకున్న చర్యల వల్ల పేద విద్యార్ధులు ఐటీ రంగంలోకి వచ్చారన్నారు.ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు ఇండియాకు చెందిన వారే సీఈవోలుగా ఉన్నారన్నారు.పోర్టులు, విమానాశ్రయాలు, నిర్మాణానికి చేసిన కృషిని చంద్రబాబు ప్రస్తావించారు.తాను సీఎంగా ఉన్న కాలంలో తీసుకు వచ్చిన సంస్కరణలు అభివృద్దికి కారణమయ్యాయన్నారు.
దేశంలో కూడా అనేక వచ్చిన అనేక సంస్కరణలు కూడా దేశాన్ని ప్రపంచంలో అభివృద్ది చెందిన దేశాల్లో పోటీల్లో నిలిపేలా చేసిందని చంద్రబాబు చెప్పారు. రక్షణ రంగంలో దేశం ఎంతో పురోభివృద్ధి సాధించినట్టుగా చెప్పారు. దేశ రక్షణ అవసరాల కోసం అవసరమైన ఆయుధాలను దేశంలోనే తయారు చేస్తున్నారన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగంలో ఆయుధాలను తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాల విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు రోడ్లు లేకపోవడం వంటి విధానాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుండి బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. విద్య, ఆరోగ్యం విషయంలో అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. . విదేశీయుల పాలనలో ఇండియా దోపిడీకి గురైందని చంద్రబాబు చెప్పారు. నెహ్రు, పీవీ నరసింహరావు, వాజ్ పేయ్ వంటి నేతలు దేశాభివృద్ది కోసం అనేక కార్యక్రమాలు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధాని మోడీ ఎన్నో విషయాల్లో ఇతర దేశాల కంటే ముందున్నారని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. ఇండియాలో మేధావులకు కొదవ లేదన్నారు. పీవీ నరసింహారావు తీసుకు వచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశ ఆర్ధిక స్వరూపాన్ని మార్చాయని చంద్రబాబు గుర్తు చేశారు.పేద ప్రజలకు సేవ చేయడం కోసం ఎన్టీఆర్ సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. టీడీపీ సర్కార్ తీసుకు వచ్చిన మహిళా రిజర్వేషన్లు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు దోహదపడిందని చెప్పారు.