పేదల ఇళ్ల పేరిట రూ.400 కోట్ల కుంభకోణం: వైసీపీపై చంద్రబాబు విమర్శలు

By Siva KodatiFirst Published Jun 4, 2020, 3:11 PM IST
Highlights

వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గురువారం వరుస ట్వీట్లతో ఆయన విరుచుకుపడ్డారు. 

వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గురువారం వరుస ట్వీట్లతో ఆయన విరుచుకుపడ్డారు. పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్ళు మంజూరు చేసి.. 9.10లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3 దశల్లో 8 లక్షల గృహప్రవేశాలు చేయించిందని ఆయన గుర్తుచేశారు.

మరో 20.41 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్న చంద్రబాబు... టీడీపీ సామూహిక గృహ ప్రవేశాలు కార్యక్రమం దేశానికే నమూనా అయ్యిందన్నారు. మరో 4.02 లక్షల మందికి 7,475 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్న టీడీపీ అధినేత..  విశాఖ సహా ఉత్తరాంధ్రలో, రాయలసీమలో లక్షలాది మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వెల్లడించారు.

Also Read:ఇళ్ల పట్టా కావాలంటే... మహిళలు వారి దాహాన్ని తీర్చాల్సిందే: లోకేశ్ సీరియస్

గత ఏడాదిగా ఇళ్ల పనులన్నీ ఆపేశారని, టీడీపీపై అక్కసుతో పూర్తయిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా కక్షసాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం కట్టిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని.. వైసీపీ పాలనలో పేదల ఇళ్లస్థలాల కోసమంటూ  భూసేకరణను కుంభకోణంగా మార్చారని ఎద్దేవా చేశారు.

ఎకరా రూ.7 లక్షల విలువచేయని భూములను రూ.45 నుంచి రూ.70 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి, వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. పేదలకు ఇళ్లస్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల స్కామ్ లు చేశారని.. ఆవ భూముల్లోనే రూ.400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నిజనిర్ధారణ కమిటీ పేర్కొందని తెలిపారు.

Also Read:స్నానం చేసే మహిళల వీడియోలు తీసి వేధింపులు...: వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

ఇది చాలదన్నట్లు ఇప్పుడు పేదల నుంచి వసూళ్ల దందాకు వైసీపీ తెరలేపిందని.. ఇళ్ల స్థలం కావాలంటే రూ 30వేలు, రూ 60వేలు, రూ లక్షన్నర చొప్పున రేట్లు నిర్ణయించారని చంద్రబాబు ఆరోపించారు.

గ్రామానికో రేటు, దగ్గర అయితే ఒక రేటు, దూరం అయితే ఇంకో రేటు వసూలు చేస్తున్నారని... పేదల సంక్షేమం లోనూ దోపిడీకి పాల్పడిన చరిత్ర వైసీపీదేనని చంద్రబాబు నాయుడు విమర్శించారు. 

click me!