రాజధానిని ఎంచుకునే ‘పవర్’ అల్రెడీ వాడేశాం.. రాజీనామా చేసి గెలిచారా చూద్దాం: జగన్‌కు చంద్రబాబు సవాల్

By Siva KodatiFirst Published Mar 24, 2022, 7:42 PM IST
Highlights

మూడు రాజధానులకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజధానిని ఎంపిక  చేసుకునే అధికారాన్ని ఒకసారి వాడేశామని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్‌కు పాలించే అర్హత లేదంటూ ఫైరయ్యారు. 
 

వైసీపీ ప్రభుత్వంపై (ysrcp govt) విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత (tdp) చంద్రబాబు నాయుడు (chandrababu naidu). గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో 3 రాజధానులపై (ap three capitals) సీఎం మాట్లాడి, మరోసారి మూడు ముక్కలాటకు తెరదీశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్‌పైన విషం చిమ్ముతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భావితరాల భవిష్యత్‌పై ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. ప్రజల్ని చంపేస్తామని మీరు చట్టం చేయలేరంటూ ఎద్దేవా చేశారు. ఏకపక్షంగా అగ్రిమెంట్ చేసుకోవడానికి వీల్లేదన్నారు. అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు వుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించినప్పుడు మీరు అక్కడే వున్నారు కదా అని ప్రతిపక్ష నేత దుయ్యబట్టారు. ఎందుకు ఆ రోజు వ్యతిరేకించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ  ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా, మనసు బాగుండాలంటూ దుయ్యబట్టారు. ప్రజలకు అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని చంద్రబాబు అన్నారు. రాజధానిని ఎంపికే చేసుకునే రాష్ట్ర అధికారాన్ని ఒకసారి ఉపయోగించుకున్నామని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టం చేయలేరని చంద్రబాబు అన్నారు. 

Latest Videos

హైదరాబాద్ కోకాపేటలో లక్ష రూపాయలు వున్న ఎకరం.. ఇప్పుడు కోట్లు పలుకుతుందని ఆయన గుర్తుచేశారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం రద్దు చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని ఆయన సవాల్ విసిరారు. అగ్రిమెంట్ కుదిరిన తర్వాత తప్పుకోవడం హక్కుల ఉల్లంఘనేనని చంద్రబాబు చురకలు వేశారు. లేని సమస్యలు సృష్టించి అంతా కాళ్ల బేరానికి రావాలన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ప్రతి ఒక్కరికి హక్కులు వున్నాయని.. మీకు అధికారం వుంది కదా అని కాళ్ల బేరానికి రావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో గౌరవంగా బతికే హక్కు కూడా కోల్పోయే పరిస్ధితి తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక నీచమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని.. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోర్టుల ప్రాథమిక విధి అని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం సాయంత్రం రావడం 41 ఏ నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం .. జైల్లో పెట్టేయడమేనా అంటూ చంద్రబాబు ఫైరయ్యారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం A CAPITAL అని వుందన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని.. లక్షల కోట్లు అవసరం లేదని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని, నమ్మక ద్రోహం చేసిన జగన్‎కు పాలించే హక్కు లేదని ధ్వజమెత్తారు.
 

click me!