
ఏపీ శాసనసభ స్పీకర్ (ap assembly speaker) తమ్మినేని సీతారాం (tammineni sitaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మూడు రాజధానులపై (ap three capitals) హైకోర్టు తీర్పుకు (ap high court) సంబంధించి సీఎం జగన్ (ys jagan) ప్రసంగించిన తర్వాత స్పీకర్ మాట్లాడుతూ.. తీర్పుకు సంబంధించి తాను చాలా అంశాలపై ప్రీపేర్ అయ్యానని చెప్పారు. తాను మాట్లాడాల్సిన అంశాలపై సీఎం జగన్, మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడేశారని స్పీకర్ తెలిపారు. అందరి వివరణ బాగుందని ఆయన ప్రశంసించారు. నాలుగు గంటల పాటు ఈ వ్యవహారంపై ప్రశ్నించాల్సిన పరిస్ధితి ఎందుకు వచ్చిందనే దానిపై తల్లిపిల్లాడి కథ గుర్తుకొస్తుందన్నారు.
‘‘ తల్లీ వద్దకు పాపం పిల్లాడు ఏడ్చుకుంటూ వచ్చాడంట... ఎందుకురా నాయనా ఏడుస్తున్నావని తల్లి అడిగింది. నాకు చీమ కుట్టేసిందని అన్నాడట. చీమ చీమ ఎందుకు కుట్టావు అని అడిగితే.. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట’’. దీనిని బట్టి ఎవరి బాధ్యతలు, ఎవరి హక్కులను వారు పరిరక్షించుకుంటూ ఈ మూడు స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలని స్పీకర్ తెలిపారు. ఎవరి విధులు, బాధ్యతలు వారు నిర్వర్తించుకుంటూ పోవాలన్నారు. ఎవరి మనోభావాలను వారు గౌరవించుకుంటూ .. పరస్పర సహాయ సహకారాలతో ఈ వ్యవస్థలను నడిపించుకున్నప్పుడే సూర్య చంద్రులు వున్నంత వరకు అంబేద్కర్ నిర్దేశించిన ఫెడరల్ స్పూర్తి కొనసాగుతుందన్నారు.
‘‘నా చెప్పులో ఇంకొకరు కాలు పెట్టి నడుస్తానంటే ఎట్లా’’ అంటూ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నడకకు ఠీవి రాదని.. ఎక్కడో ఒక చోట బోల్తా పడతారని తమ్మినేని అన్నారు. అలాంటి పరిస్ధితి ఇక్కడ ఉత్పన్నమైనందుకు చాలా బాధగా వుందన్నారు. ఇప్పటికైనా విషయం సభ ద్వారా మన అభిప్రాయాలు వారికి తెలియజేశామన్నారు. ఈ సార్వభౌమాధికారాన్ని కించపరిచే పరిస్థితి వస్తే .. దానికి తలవంచడానికి ఈ శాసనసభ సిద్దంగా వుందని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.
ఈ చర్చ ద్వారా మూడు వ్యవస్థల విస్తృతమైన పరిధి, ప్రయోజనాలు కాపాడుకుంటూ వెళ్తే బాగుంటుందని తెలిపామన్నారు. ఫెడరల్ స్పూర్తిని గౌరవించుకుంటూ వెళ్లాల్సిన అవసరం వుందన్నారు. అసలు శాసన సభ ఎందుకుంది అని కోర్టు తీర్పు కారణంగా ప్రజలు చర్చించుకుంటున్నారని స్పీకర్ వెల్లడించారు. శాసనసభ అధికారాలు ఏంటి అని అడుగుతున్నారని.. ప్రజలకు తెలియజేసేందుకే ఈ చర్చ జరిగిందని తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు.