మూడు రాజధానులు.. హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 24, 2022, 6:09 PM IST
Highlights

మూడు రాజధానులపై వెనకడుగు వేసేది లేదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ . అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కోర్టు తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టసభకు సర్వాధికారాలు వున్నాయని ఆయన పేర్కొన్నారు. 

అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో వుండాలని.. లేకపోతే మొత్తం సిస్టమ్ కుప్పకూలుతుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) . ఏపీ అసెంబ్లీలో (ap assembly) మూడు రాజధానుల బిల్లుపై (ap three capitals) చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టారని జగన్ చెప్పారు. శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా.. వద్దా అని కోర్టులు నిర్ణయించలేవని ఆయన అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారని జగన్ పేర్కొన్నారు. నెల రోజుల్లో లక్ష కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు వుందని జగన్  చెప్పారు. 

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పందని సీఎం గుర్తుచేశారు. 3 రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలో చెప్పిన మాటలన్నింటికీ తమ సర్కార్ కట్టుబడి వుందని జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని సీఎం తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం లేదని కోర్టు తీర్పు చెప్పిందని.. రాజధానిపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదని కోర్టు చెప్పినట్లు జగన్ గుర్తుచేశారు. 

Latest Videos

రాజధానిపై నిర్ణయం తమదేనని కేంద్రం కూడా ఎక్కడా చెప్పలేదని సీఎం అన్నారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం కూడా అఫిడవిట్  ఫైల్ చేసిందని చెప్పారు. రాజధానిపై రాష్ట్రానిదే నిర్ణయమని పార్లమెంట్‌లో కూడా ఒక ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని జగన్ గుర్తుచేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చిందని సీఎం తెలిపారు. హైకోర్టు ఎక్కడ వుంటే అక్కడే రాజధాని అనే వాదనను కూడా కొట్టిపారేశారని జగన్ అన్నారు. రాజధానితో పాటు పరిపాలన వికేంద్రీకరణకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. 

మాకు హైకోర్టుపై గౌరవం వుందని.. రాష్ట్ర అసెంబ్లీకి వున్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాపై వుందని జగన్ తెలిపారు. ఎవరో ఫేవర్ చేస్తే తాము ఇక్కడికి రాలేదని.. ప్రజలు ఎన్నుకుంటేనే అసెంబ్లీకి వచ్చామన్నారు. ఇవాళ చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది కోర్టులా, అసెంబ్లీనా అన్నది క్వశ్చన్ మార్క్ అవుతుందని జగన్ అన్నారు. ఆచరణ సాధ్యంకాని తీర్పులు వుండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సీఎం అన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ వున్నా.. హైకోర్టు ఆచరణ సాధ్యం కానీ తీర్పు ఇచ్చిందని జగన్ చెప్పారు. మాస్టర్ ప్లాన్  కాలపరిమితి 20 ఏళ్లు అని అప్పటి ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తుచేశారు. 

మాస్టర్ ప్లాన్‌ను ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించాలని కూడా రాశారని సీఎం  తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను 20 ఏళ్లలో అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలుసునని అన్నారు. ఈ ప్రాంతం మీద తనకు ప్రేమ వుంది కాబట్టే.. తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని ఆయన చెప్పారు. లక్ష కోట్లు అనేది 20 ఏళ్లకు 15 నుంచి 20 కోట్లు అవుతుందన్నారు. అటు గుంటూరు కాదు.. ఇటు విజయవాడ కాదు, తన బినామీలకు భూములు వున్న చోట రాజధాని అన్నారని జగన్ ఆరోపించారు. 

ఈ ప్రాంతమంటే ఇష్టం కాబట్టి.. ఇక్కడే శాసన రాజధానిని వుంచామన్నారు. రాజధాని ప్రాంతంలో కనీస అవసరాలు సమకూర్చడానికే లక్ష కోట్లు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ఒక్కటే బాధ్యత కాదని.. ప్రజా సంక్షేమం కూడా ముఖ్యమేనన్నారు. న్యాయ సలహా తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా చర్చలు జరుపుతున్నామని.. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందేలా పరిపాలనా వికేంద్రీకరణను కొలిక్కి తీసుకొస్తామని జగన్ స్పష్టం చేశారు. 

రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తామని.. వికేంద్రీకరణపై వెనకడుగు వేయమన్నారు. వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి.. అందరి ఆత్మ గౌరవమన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వికేంద్రీకరణే సరైన మార్గమని జగన్ స్పష్టం చేశారు. అందరికీ మంచి చేసే బాధ్యత మాపై వుందని సీఎం అన్నారు. వికేంద్రీకరణ తప్ప మరో మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. చట్టసభకు సర్వాధికారాలు వున్నాయని.. రాబోయే తరాల కోసమే వికేంద్రీకరణ అని జగన్ చెప్పారు. 

click me!