నరసరావుపేట ఉద్రిక్తత... టిడిపి నేతను తరలిస్తున్న అంబులెన్స్ పై వైసిపి శ్రేణుల దాడి... చంద్రబాబు సీరియస్

By Arun Kumar PFirst Published Jan 16, 2022, 9:11 AM IST
Highlights

నరసరావుపేట టిడిపి ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు పై పోలీసుల దౌర్జన్యానికి దిగడం, అస్వస్థతకు గురయిన అతడిని తరలిస్తున్న అంబులెన్స్ పై వైసిపి శ్రేణులు దాడి చేయడంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. 

గుంటూరు: తెలుగుదేశం పార్టీ (TDP) నరసరావుపేట ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు (chadalavada arvind babu)పై జరిగిన దాడిపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సీరియస్ అయ్యారు. ఈ దాడిని ఖండించిన వైసీపీ (ycp) మూకలు దాడిచేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పార్టీ నేతల ద్వారా చంద్రబాబు తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... టిడిపి (TDP) కార్యకర్తల అక్రమ అరెస్టులపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా? అని వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరవింద్‍ బాబుతో పాట ఇతర నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడం... ఈ క్రమంలో అస్వస్థతకు గురైన టీడీపీ నేతలను తరలించే అంబులెన్స్ పైనా దాడికి దిగడం వైసీపీ ఆరాచకానికి, పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఘర్షణకు కారణమైన వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. 

చదలవాడపై జరిగిన దాడిపై టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) స్పందించారు. సంక్రాంతి పండగపూట రాష్ట్రంలో వైసిపి అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులను ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?  అని ప్రశ్నించారు. 

''నరసరావుపేటలో టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‍బాబుపై పోలీసులు, వైసీపీ నేతల దౌర్జన్యం చేయడం దుర్మార్గం. పండుగపూట కూడా వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడడం దారుణం. అరవింద్‍బాబు, టీడీపీ శ్రేణులపై పోలీసులు, వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులు, అందుకు సహకరించిన పోలీసులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. 

మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా నరసరావుపేటలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. అధికార అండతో వైసీపీ నేతలు, కార్యకర్తలు... ఆ పార్టీ నేతల అండతో పోలిసులు బరితెగించి ప్రవరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసిపి అరాచకాలు, పోలీసుల దౌర్జన్యాలకు హద్దు అదుపు లేకుండా పోతోందని యనమల మండిపడ్డారు. 

''నరసరావుపేట టీడీపీ ఇంచార్జి అరవింద్ బాబుపై దాడిని తీవ్రంగా కండిస్తున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీసేలా వ్యహరించడం దుర్మార్గం.  అల్లర్లకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తల్ని వదిలి టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేస్తారా? జగన్ రెడ్డి పాలన గాలికొదిలి ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తల ప్రాణాలు తీస్తున్నారు. అరవింద్ బాబుకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, డీజీపీదే బాధ్యత'' అని యనమల హెచ్చరించారు. 

నరసరావుపేటలో ఉద్రిక్తత:

గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం జొన్నలగడ్డలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాయం చేశారని గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలపై  వైసీపీ నేతలు పిర్యాదు చేసారు.దీంతో పొలీసులు టీడీపీ కార్యకర్తలు అనిల్, రాజేష్ ను అరెస్ట్ చేసారు. ఈ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ ఇంచార్జీ చదలవాడ అరవింద్ బాబు శనివారం ఆందోళన దిగారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి గుంటూరు-కర్నూలు హైవేపై బైఠాయించిన చదలవాడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో టిడిపి శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. 

ఉద్రిక్త పరిస్థితులతో తీవ్ర అస్వస్థతకు గురయిన అరవింద్ బాబును అంబులెన్స్ లోఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. వైసీపీ వాళ్లే అంబులెన్స్ పై రాళ్లతో దాడికి దిగారని టీడీపీ ఆరోపిస్తోంది.దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.
 
ప్రస్తుతం నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చదలవాడకు చికిత్స పొందుతున్నారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం బిపి డౌన్ అయిందని, ఈసీజీలో గుండె కొట్టుకోవడంలో స్వల్ప మార్పులు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. 

click me!