West Godavari Road Accident: లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు... పదిమందికి గాయాలు

By Arun Kumar PFirst Published Jan 16, 2022, 7:53 AM IST
Highlights

సంక్రాంతి పండగపూట హైదరాబాద్ నుండి రాజమండ్రికి 25మంది ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది.   

ఉంగుటూరు‌:  సక్రాంతి పండగ (sankranti festival)ను ఆనందంగా కుటుంబసభ్యులతో జరుపుకోవాలని సొంతూళ్లకు వెళుతున్న కొందరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ (hyderabad) నుండి రాజమండ్రి (rajahmundry) వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఉపాది, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిపోయిన వారు కూడా సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళుతుంటారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు తమతమ ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఇప్పటికే హైదరాబాద్ సగం ఖాళీ అయ్యింది. అయితే కాస్త ఆలస్యమైనా పండక్కి ఇంటికి వెళ్లాలని భావించిన కొందరు హైదరాబాద్ నుండి తమ స్వస్థలం రాజమండ్రికి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. 

ఇలా దాదాపు 25మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి ట్రావెల్ బస్సు బయలుదేరింది. మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుతామనగా తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తు ఆవహించినట్లుంది. అతివేగంతో వెళుతున్న బస్సు పశ్చిమ గోదావరి జిల్లా బీమడోలు జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. రోడ్డుపక్కన ఆగివున్న లారీని బస్సు వెనకనుండి ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న 108అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక ఇదే పశ్చిమ గోదావరి (west godavari) జిల్లాలో లారీ బోల్తా పడడంతో నలుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. చేపల లోడ్ తో నారాయణపురం నుంచి దువ్వాడ వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ కింద పడి నలుగురు కూలీలు మరణించారు.

ఇదిలా ఉండగా నెల్లూరు (nellore)లో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వైపుగా వస్తున్న గరుడ బస్సు అదుపు తప్పి కాల్వ వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు.  

చెన్నై నుంచి నెల్లూరు వైపుగా వస్తున్న ఆర్టిసి గరుడ బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న కాల్వ వంతెనను ఢీకొట్టింది. అర్ధరాత్రి కావడంతో బస్సులో చాలా మంది నిద్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. నెల్లూరు రూరల్ మండలం బురాన్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
 

click me!