
పులివెందులలో సీఎం వైఎస్ జగన్‌పై తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల స్థానాన్ని వైఎస్ జగన్ నుంచి టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా బుధవారం గండికోట రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల చంద్రబాబు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇక, పులివెందుల పూలఅంగళ్ల సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి.. ‘‘వై నాట్ పులివెందుల’’ అని నినాదం చేశారు. పులివెందులలో తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల, గండికోట, పైడిపాలెం, చిత్రావతికి నీళ్లు తెచ్చింది టీడీపీనేనని.. బానకచెర్లకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి రాయలసీమకు సరిపడా నీళ్లు అందించడమే తన జీవిత ఆశయమని అన్నారు.
పులివెందులలో బస్టాండ్ సమస్యను తాను లేవనెత్తిన తర్వాతే వైసీపీ ప్రభుత్వం నిర్మించిందని చంద్రబాబు అన్నారు. పులివెందులలో జగన్ 8 వేల ఇళ్లు కట్టించారా అని ప్రశ్నించారు. అలాగే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని.. వైసీపీ కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. ‘జై అమరావతి’ అంటూ అక్కడి జనాల చేత నినాదాలు చేయించారు. అమరావతి రాజధానికి పులివెందుల ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో జగన్ చూడాలి అంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వం కరెంట్ చార్జీలను విపరీతంగా పెంచిందని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్‌పై టీడీపీ అభ్యర్థిగి బీటెక్ రవి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించారు. పులివెందుల ప్రజలు బీటెక్ రవికి మద్దతు అందించాలని కోరారు. ఇక, అంతకుముందు జమ్మలమడుగు పాత బస్టాండ్‌లో టీడీపీ అధినేత ప్రసంగిస్తుండగా మంటలు చెలరేగాయి. అయితే వెంటనే పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇదిలాఉంటే, పులివెందులలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు రాకకు కొన్ని గంటల ముందుపులివెందుల పట్టణంలో కొంత మంది టీడీపీ అనుచరులు చంద్రబాబుకు కోసం వేచి ఉన్న ప్రదేశంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగారు. రెండు వాహనాల్లో వచ్చిన వైసీపీ కార్యకర్తలు ‘జై జగన్’ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలను పట్టుకునేందుకు వారిని టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. ఈ క్రమంలోనే ఒక్క వైసీపీ కార్యకర్తను పట్టుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకున్నారు.