కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. టీడీపీ హాజరవుతుందా లేదా, చంద్రబాబు స్పందన ఇదే

Siva Kodati |  
Published : May 25, 2023, 05:46 PM IST
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. టీడీపీ హాజరవుతుందా లేదా, చంద్రబాబు స్పందన ఇదే

సారాంశం

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్పందనను తెలియజేశారు.  దీనిని కట్టడంలో ఎంతో శ్రమించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. 

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌ను ప్రారంభిస్తారు. అయితే విపక్షాలు మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగానే ఇది జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం మాత్రం ప్రధాని మోడీయే పార్లమెంట్‌ను ప్రారంభిస్తారని తేల్చిచెప్పింది. దీంతో 21 విపక్ష పార్టీలు కార్యక్రమానికి దూరంగా వుండనున్నాయి. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఇంకా తమ స్పందన తెలియజేయలేదు. తాజాగా ఎన్డీయేలో ఒకప్పుడు భాగస్వామిగా వున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 

దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చరిత్రాత్మకమైనదన్నారు. దీనిని కట్టడంలో ఎంతో శ్రమించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన చట్టాల రూపకల్పనకు ఈ భవనం వేదిక కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదరికం లేని భారతదేశాన్ని నిర్మించేందుకు కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచి కావాలని ఆయన కోరారు. 

అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం, ప్రారంభోత్సవంపై స్పందించిన సంగతి తెలిసిందే. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి.. అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు. ఇలాంటి కార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్పూర్తి కాదని జగన్ అన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుందని సీఎం స్పష్టం చేశారు. 

మరోవైపు.. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించేందుకు లోక్‌సభ సెక్రటేరియట్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మే 18న లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన ప్రకటన, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్ జారీ చేసిన ఆహ్వానాలు రాజ్యాంగ ఉల్లంఘనేనని న్యాయవాది జయ సుకిన్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడని, పార్లమెంట్‌కు అధిపతి అని, కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ స్పీకర్ ఆహ్వానం మేరకు మే 28న ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటులో భారత రాష్ట్రపతి, అపెక్స్ లెజిస్లేచర్ ఉభయ సభలు, రాజ్యసభ, లోక్‌సభ ఉంటాయని అభ్యర్ధన పేర్కొంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?