హైదరాబాద్ వల్ల ఒక్క కులమే బాగుపడిందా.. నాటి అభివృద్ధి వల్లే 2014లో టీడీపీ విజయం : చంద్రబాబు

By Siva KodatiFirst Published Sep 8, 2022, 9:41 PM IST
Highlights

హైదరాబాద్ అభివృద్ధి జరిగాక ప్రజలు బాగుపడ్డారా లేక ఏదైనా ఒక కులం బాగుపడిందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలదీశారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసిన అనుభవం చూసే 2014లో ప్రజలు ఓట్లేసి గెలిపించారని చంద్రబాబు గుర్తుచేశారు.
 

ధర్మాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్పవు, ఆ త్యాగాలే అమరావతి రైతులు చేస్తున్నారని అన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. గురువారం అమరావతి: వివాదాలు – వాస్తవాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... అమరావతి సంకల్పం వృధాగా పోదు, ఆ సంకల్పమే ధర్మాన్ని గెలిపిస్తుందన్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఒకే వేదిక మీదున్నా అందరి ఆకాంక్ష అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ప్రజలు అమరావతి పరిరక్షణకు ఆలోచన చేయాలని.. అమరావతికి ధీటుగా విశాఖ, కర్నూల్, తిరుపతి కూడా అభివృద్ధి చెందాలన్నదే టీడీపీ ఉద్దేశ్యమన్నారు. 

ALso Read:కన్ను పొడిచినా స్టేషన్ బెయిల్... నినాదాలకే హత్యాయత్నం కేసు, ఇంతలా సాగిలపడొద్దు : పోలీసులపై బాబు ఫైర్

ఆనాడు ఏ కులం కోసం హైదరాబాద్ అభివృద్ధి చేశామని చంద్రబాబు ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి జరిగాక ప్రజలు బాగుపడ్డారా లేక ఏదైనా ఒక కులం బాగుపడిందా అని టీడీపీ చీఫ్ నిలదీశారు. ఏ రాజకీయ పార్టీ, వ్యక్తీ శాశ్వతం కాదు, చేసే మంచి పనులే శాశ్వతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నవారు ఏం చేసినా అది సమాజం మీద ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి నిలిపివేయాలనే ఆలోచన ఏనాడు రాజశేఖర్ రెడ్డికి రాలేదని ఆ క్యాబినెట్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణే చెప్పారని చంద్రబాబు తెలిపారు. 

హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందింది తరువాత వచ్చిన వారి అందరి సహకారంతోనే అని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాను కాబట్టే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించేవారు ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల అభివృద్ధికి కృషి చేశామన్నారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసిన అనుభవం చూసే 2014లో ప్రజలు ఓట్లేసి గెలిపించారని చంద్రబాబు గుర్తుచేశారు. అధికార వికేంద్రీకరణ కోసమే అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నామని ఆయన తెలిపారు. విశాఖను ఆర్ధిక రాజధాని గా, తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు వెల్లడించారు. 

click me!