వారానికో శాఖలో ‘‘ బాదుడే బాదుడు’’... జనాన్ని పీక్కుతింటున్నారు : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై చంద్రబాబు ఫైర్

By Siva KodatiFirst Published Apr 13, 2022, 10:07 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీలపై ఫైరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వారానికో శాఖలో ఛార్జీలు, పన్నులు పెంచడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.  ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు

ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ జగన్ (Ys jagan) ప్రభుత్వంపై ఫైరయ్యారు టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . అసమర్థ పాలనతో పేదలపై పన్నుల భారం వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతింటోందని  ఆయన ధ్వజమెత్తారు. వారానికో శాఖలో ఛార్జీలు, పన్నులు పెంచడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్తపై పన్ను, ప్రాపర్టీ టాక్స్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

ఇలాంటి సమయంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ప్రజా రవాణా అయిన ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం మోపినట్లు అవుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాన్ని, ప్రజలను ఎటు తీసుకెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సు సర్వీసులపై ఛార్జీల పెంపును ఖండించిన చంద్రబాబు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుండి బస్సు చార్జీలు పెరగనున్నాయి. టికెట్ రేటు పెంచకుండా Diesel Cess పేరుతో ప్రయాణీకులపై APSRTC భారం వేయనుంది. 2019 లో రాష్ట్రంలో బస్సు చార్జీలను పెంచిన సమయంలో డీజీల్ ధర లీటరుకు 67 రూపాయాలుండేదని ఆర్టీసీ ఎండీ Dwaraka Tirumala Rao చెప్పారు. బుధవారం నాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం డీజీల్ ధర రూ. 107 రూపాయాలకు పెరిగిందని చెప్పారు. డీజీల్ సెస్ పేరుతో చార్జీలను పెంచనున్నామని ద్వారక తిరుమలరావు తెలిపారు.  పల్లె వెలుగు బస్సులకు డీజీల్ సెస్ రెండు రూపాయలు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 5 రూపాయలు, ఏసీ బస్సులకు 10 రూపాయలు పెంచనున్నారు. అయితే కిలోమీటరుకు గతంలో ఏ మేరకు Ticket ధరను వసూలు చేస్తున్నారో దానికి అదనంగా ఈ చార్జీలను వసూలు చేస్తారు.  మరో వైపు పల్లె వెలుగు బస్సు కనీస చార్జీ రూ. 10 చేశారు.

Coronaతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. డీజీల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లోకి నెట్టివేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో డీజీల్ సెస్ వసూలు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని ద్వారకా తిరుమల రావు చెప్పారు. డీజీల్ సెస్ వేయడం ద్వారా ప్రతి ఏటా ఆర్టీసీకి రూ. 720 కోట్లు వస్తుందన్ని ఎండీ చెప్పారు. డీజీల్ ధరలు పెరగడం వల్ల ప్రతి ఏటా తమకు రూ. 1300 కోట్లు ఆదనపు భారం పడుతుందన్నారు. కానీ డీజీల్ సెస్ పెంపు ద్వారా కూడా తమకు అంత మేర ఆదాయం రావడం లేదని ఆర్టీసీ ఎండి వెల్లడించారు. బస్ టికెట్ ధరలను 32 శాతం పెంచితే ఆర్టీసీ నష్టాలను కొంతలో కొంత తగ్గించే అవకాశం ఉందని ఎండీ పేర్కొన్నారు. కానీ అంత మేరకు చార్జీలు పెంచే అవకాశం లేనందున డీజీల్ సెస్ విధిస్తున్నామని ద్వారకా తిరుమలరావు చెప్పారు. 

click me!