
మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ (ap cabinet reshuffle) తర్వాత నెల్లూరు (nellore) వైసీపీలో (ysrcp) వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి (kakani govardhan reddy) అన్ని విధాలా నిన్నటికి నిన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) చేసిన వ్యాఖ్యలు మరిచిపోకముందే .. ఇవాళ కాకాణి ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. నెల్లూరు జిల్లా హరినాథపురంలో ఒకటి, మద్రాస్ బస్టాండ్‌లో మరొక ఫ్లెక్సీలు చినిగిపోయాయి. జిల్లాలో గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్‌కి కాకాణికి మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. నిన్న ఇదే విషయమై అనిల్‌ను ప్రశ్నిస్తే.. కాకాణికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. గతంలో కాకాణి తనకు చేసిన దానికంటే ఎక్కువే సహకరిస్తానని వంగ్యాస్త్రాలు సంధించారు అనిల్ కుమార్ యాదవ్.
కేబినెట్ పునర్వ్యస్ధీకరణ తర్వాత పాత మంత్రుల నుంచి అనిల్ కుమార్‌కు జాబితాలో చోటు దక్కలేదు. నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డికి మంత్రిని చేశారు. 2019లోనే కాకాణి మంత్రి పదవి ఆశించినా.. ఆ సమయంలో అనిల్‌తో పాటు మేకపాటి గౌతంరెడ్డిని (mekapati goutham reddy) మాత్రమే కేబినెట్‌లోకి తీసుకున్నారు జగన్. ఇప్పుడు మాత్రం కాకాణికి ఛాన్సిచ్చారు సీఎం.
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. గతంలోని సంగతులను మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ .. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేశారు. కాకాణి ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలే వచ్చారు. అదే రోజు అనిల్ కుమార్ , నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు (nallapareddy prasanna kumar reddy) ప్రత్యేకంగా భేటీ కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రి కాకాణికి ఏమాత్రం సహకరించ కూడదనే వీరి చర్చ సాగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేసేటట్లుగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన కామెంట్స్ వున్నాయని పార్టీ నేతలు అంటున్నారు.
గతంలో కాకాణి- ఆనం జట్టు కట్టినట్లే.. ఇప్పుడు అనిల్- ప్రసన్నకుమార్ రెడ్డి దోస్తి చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి గోవర్థన్ రెడ్డి సొంత జిల్లాకు రాకముందే ఈ స్థాయిలో మాటల మంటలు రేగడం, వ్యంగ్యాస్త్రాలు సంధించడం చర్చనీయాంశమైంది.