
రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. తన ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చిన ప్రజా స్పందన అద్భుతమని ఆయన అన్నారు. తన జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగిందని.. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు చంద్రబాబు తన మూడు రోజుల ఉత్తరాంధ్ర, కోస్తాజిల్లాల పర్యటనపై శనివారం ట్వీట్ చేశారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ ‘‘బాదుడే బాదుడు’’ పై ప్రజల అభిప్రాయాలు, అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందని ఆయన స్పష్టం చేశారు. తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ... ఈ టూర్‌కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై TDP చీఫ్ Chandrababu Naidu శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం రావాలి, టీడీపీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ఓ మెట్టు దిగుతానన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్దమేనని ఆయన తేల్చి చెప్పారు.
జనసేన (janasena) చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్ధించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాను ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారానికి తెర తీసింది. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
గతంలో కుప్పంలో చంద్రబాబు టూర్ సమయంలో కూడా జనసేనతో పొత్తుపై ఓ కార్యకర్త ప్రశ్నించారు. అయితే వన్ సైడ్ లవ్ సరైంది కాదని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించారు.