దేశ చరిత్రలో నిలిపోయేలా... 800 రోజులకు అమరావతి ఉద్యమం: చంద్రబాబు అభినందనలు

By Arun Kumar PFirst Published Feb 24, 2022, 1:55 PM IST
Highlights

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 800రోజులకు చేరిన సందర్భంగా ఉద్యమకారులకు టిడిపి చీఫ్ అభినందనలు తెలిపారు.  

అమరావతి: జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల (three capitals) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి (amaravati) రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 800 రోజులకు చేరింది. ఇలా ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ అలుపెరగకుండా పోరాడుతున్న ప్రజలకు మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 

''మీ ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. తన మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన సీఎం జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదు'' అని చంద్రబాబు మండిపడ్డారు. 

Latest Videos

''రాజ‌ధాని ప్రాంతం స్మశానం అన్నవాళ్లే ఇప్పుడు అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. రాజధాని విషయంలో నిలకడలేని నిర్ణయాలు, ముందు చూపులేని ఆలోచనలతో వ్యవహరిస్తున్న వైసిపి ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికే శాపంలా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి'' అని డిమాండ్ చేసారు. 

''దేశ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం ఎల్లవేళలా అండగా నిలుస్తుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రజల అభిప్రాయాలను వైసిపి ప్రభుత్వం గౌరవించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'' అని చంద్రబాబు సూచించారు. 

ఇక ఇప్పటికే అమరావతి ఉద్యమం 800 రోజులకు చేరిన సందర్భంగా రైతులు 24గంటల సామూహిక నిరాహార దీక్షలకు దిగారు. ఇవాళ(గురువారం) ఉదయం 9గంటలకు ప్రారంభమైన ఈ నిరాహారదీక్ష రేపు(శుక్రవారం) ఉదయం 9గంటల వరకు కొనసాగనుంది. అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఈ నిరాహార దీక్ష కొనసాగనుంది. రైతుల దీక్షకు ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాలు కూడా మద్దతిచ్చాయి. 

ఇదిలావుంటే ఇప్పటికే అమరావతి ప్రజలు వివిధ రూపాల్లో గత రెండేళ్లుగా ఉద్యమిస్తూనే వున్నారు. ఇటీవల న్యాయస్థానం టు దేవస్థానం పేరిట మహా పాదయాత్ర చేపట్టి అమరావతి ఉద్యమానికి మరింత ఊపు తీసుకువచ్చారు. అమరావతి నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టి తిరుపతిలో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసారు. ఈ సభద్వారా వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. 

ఇలా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో ఉద్యమం 800రోజుల మైలురాయికి చేరిన సందర్బంగా 24గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని అమరావతి రైతులు, మహిళలు స్పష్టం చేసారు.  

గతంలో ఈ అమరావతి ఉద్యమం 700 రోజులకు చేరుకున్న సమయంలో జగన్ తో పాటు ఆయన మంత్రివర్గంపై నారా లోకేష్ ఘాటు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ తో పాటు ఆయ‌న మంత్రులు మ‌రో మూడు జ‌న్మ‌లెత్తినా మూడురాజ‌ధానులు క‌ట్ట‌లేరని లోకేష్ ఎద్దేవా చేసారు.

''ప్ర‌జా రాజ‌ధాని కోసం భూములనే కాదు ప్రాణాలను సైతం తృణ‌ప్రాయంగా చేసిన రైతుల త్యాగం నిరుప‌యోగం కాదు. అమ‌రావ‌తి కోట్లాది మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌. అమ‌రావతి వైపు న్యాయం ఉంది. కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా ప్ర‌జ‌లు, రాజ‌కీయ పార్టీల‌ మ‌ద్ద‌తు ఉంది. ఒకే రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-ఒకే రాజ‌ధాని అమ‌రావ‌తి మాత్ర‌మే ఉంటాయి'' అని  లోకేష్ పేర్కొన్నారు.

 
 


 

click me!