
Visakhapatnam Train Accident : ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం-దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటానగర్-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా అర్థరాత్రి 1.30 గంటల సమయంలో కొన్ని బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన లోకో పైలట్లు ఎలమంచిలి సమీపంలో రైలును ఆపారు... వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది మంటలను అదపు చేసేందుకు ప్రయత్నించారు.
టాటానగర్ - ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు ఏసీ కోచ్‌లు పూర్తిగా కాలిపోయాయి... బి1, ఎం2 కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ రెండు కోచ్‌లలో ఉన్న 158 మంది ప్రయాణికులను సిబ్బంది కాపాడారు. ఒకరు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు.
18189 టాటానగర్ - ఎర్నాకుళం జంక్షన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కోచ్‌లలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను గమనించిన వెంటనే రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైర్ ఇంజన్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి.
రెస్క్యూ ఆపరేషన్‌ను సీనియర్ రైల్వే అధికారులు పర్యవేక్షించారు. మంటలు అంటుకున్న రెండు కోచ్‌లను వెంటనే రైలు నుంచి వేరు చేశారు. ప్రయాణికులను వెంటనే బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని రైల్వే శాఖ తెలిపింది.