AP capital: ఏపీకి 3 రాజధానులు: జగన్ నిర్ణయం వెనకున్నది ఈయనేనా?

By telugu team  |  First Published Dec 22, 2019, 1:34 PM IST

రాజధాని మార్పు విషయం కేవలం అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు-నలుగురికి మాత్రమే తెలుసు అని సమాచారం. జగన్ ఈ కసరత్తును ప్రారంభించేటప్పుడు జ్యోతిష్య, వాస్తు సలహాలను తీసుకున్నారట. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ వ్యక్తి ఉన్నట్టు బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.  


ఎప్పుడైతే జగన్ మూడు రాజధానులు రావచ్చు అని ప్రకటించారో...ఇక అప్పటి నుంచి మొదలు ఏపీ రాజకీయం మొత్తం రాజధాని చుట్టూనే తిరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. 

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతిని రాజధానిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొదలు రాజధాని మార్పు పై అనేక చర్చలు జరుగుతున్నాయి. 

Latest Videos

బడ్జెట్ కేటాయింపులు తగ్గించినప్పుడు, బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు కూడా ఈ అనుమానాలు బలపడ్డాయి. కానీ ఏకంగా ఈ రేంజ్ లో ట్విస్ట్ ఇస్తారని ఎవ్వరు ఊహించలేదు. జగన్ నిర్ణయం కేవలం ప్రతిపక్షానికే కాదు..సొంత పార్టీలోని నేతలకు కూడా షాక్ ఇచ్చిందంటే, ఈ నిర్ణయాన్ని ఎంత రహస్యంగా ఉంచారో మనం అర్థం చేసుకోవచ్చు. 

అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. సీఎం కుర్చీపై కూర్చున్న నాటి నుండే... రాజధాని పై  జగన్ కసరత్తు చేయడం ఆరంభించారట.  అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే విమర్శించే జగన్... తన ప్రభుత్వం మాత్రం ఆ పొరపాటును చేయకుండా జాగ్రత్తపడ్డారట. 

Also read: పరిపాలనా రాజధానిగా భీమిలీ: మరో బాంబు పేల్చిన విజయసాయి

ఈ రాజధాని మార్పు విషయం కేవలం అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు-నలుగురికి మాత్రమే తెలుసు అని సమాచారం. జగన్ ఈ కసరత్తును ప్రారంభించేటప్పుడు జ్యోతిష్య, వాస్తు సలహాలను తీసుకున్నారట. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ వ్యక్తి ఉన్నట్టు బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.  

ఆయన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి. అవును విశాఖ శ్రీ శారదా పీఠం తొలి పీఠాధిపతి. ఆయనే ఈ నిర్ణయం వెనక ఉన్నట్టు భోగట్టా. అమరావతిని టీడీపీ రాజధానిగా ప్రకటించినప్పుడు చాలామంది అభ్యంతరం వ్యక్తంచేశారు. రాజధానిగా అమరావతికి  వాస్తు సరిగ్గా లేదని చివరికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం కూడా వాస్తు విరుద్ధంగా ఉందని అప్పట్లో కొందరు తమ ఆవేదన వ్యక్తంచేశారు. వారిలో స్వరూపానందేంద్ర సరస్వతి కూడా ఒకరు. 

అలాగే  అమరావతి, భూకంపానికి గురయ్యే ఆస్కారం కూడా ఉందని, అందుకోసం రాజధానిని చేయడం ఏమంత శ్రేయష్కరం కాదని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా అన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్వరూపానందేంద్ర జగన్ కు కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 

జగన్ ఇప్పటికే పలుమార్లు స్వరూపానందేంద్రను కలిసిన విషయం తెలిసిందే.  వారిరువురు ఇలా కలిసి చర్చించుకుంటున్నప్పుడే స్వరూపానందేంద్ర జగన్ కు రాజధాని విషయంలో ఇలా కొన్ని సూచనలు చేశారట. 

వాస్తుపరంగా కూడా అమరావతిలో నిర్మించిన అసెంబ్లీకి సచివాలయానికి చాలా మార్పుచేర్పులు చేశారు ఇరు ముఖ్యమంత్రులు. ముందు చంద్రబాబు, ఆ తరువాత జగన్ కూడా నూతన ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టేముందు అనేక వాస్తుమార్పులు చేయించుకున్నారు. 

Also read: రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికి.. పార్టీలకు కాదు: పురంధేశ్వరీ

ఈ క్రమంలో రాజధాని ప్రాంతానికి విశాఖపట్నం అన్ని విధాలుగా అనువుగా ఉంటుందనే విషయాన్ని స్వరూపానందేంద్ర జగన్ కు చెప్పినట్టు, వాస్తుపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసొస్తుందని చెప్పారట. 

దీనితో  సీఎం జగన్  నిపుణుల కమిటీలను కూడా సంప్రదించి ఈ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సో ఇదంతా నిజమే అయితే మాత్రం విశాఖను రాజధానిని చేయడానికి అనేక కారణాలతోపాటు వాస్తు కూడా ఒక కారణమన్నట్టు. 

click me!