స్వర్ణా ప్యాలెస్ అగ్నిప్రమాదం ...ముగ్గురు డాక్టర్లకు బెయిలిచ్చిన హైకోర్టు

By Arun Kumar PFirst Published Sep 4, 2020, 12:25 PM IST
Highlights

రమేష్ ఆసుపత్రి సిబ్బంది అయిన డాక్టర్ కొడాలి రాజగోపాల్, డాక్టర్ సుదర్శన్, నైట్ షిఫ్ట్ ఇంచార్జ్ వెంకటేష్ లకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు

అమరావతి: స్వర్ణా ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాద నిందితులు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయి జైల్లో వున్న ముగ్గురు నిందితుల దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రమేష్ ఆసుపత్రి సిబ్బంది అయిన డాక్టర్ కొడాలి రాజగోపాల్, డాక్టర్ సుదర్శన్, నైట్ షిఫ్ట్ ఇంచార్జ్ వెంకటేష్ లకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు ఉపయోగించిన స్వర్ణా ప్యాలస్ లో విద్యుత్ లోపాలున్నాయని... వాటిని సరిచేయకపోవడం వల్లే అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తేల్చి చెప్పారు. అందువల్లే స్వర్ణ ప్యాలెస్ లో ఈ నెల 9వ  తేదీన అగ్ని ప్రమాదం జరిగిందని... ఇందులో 10 మంది కోవిడ్ రోగులు మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన కేసులో నిందితుల అరెస్టుపై పోలీసులు నాలుగు పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఈ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు.

read more   స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: వెలుగు చూస్తున్న రమేష్ ఆస్పత్రి లీలలు

స్వర్ణ ప్యాలెస్ లో విద్యుత్ లోపాలు ఉన్నట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. విద్యుత్ లోపాలను సరి చేయాలంటే  పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం విద్యుత్ లోపాలను సరిచేయలేదని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఆరోపించారు. ఇలా విద్యుత్ వ్యవస్థలో లోపాలున్న విషయం తెలిసి కూడ రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ సెంటర్  నిర్వహించిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు.

వారం రోజుల క్రితం కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరగడానికి రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలదే బాధ్యతగా పోలీసులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ సెంటర్ ఏర్పాటు విషయమై రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాల మధ్య ఎంఎస్ఓ కుదిరిన విషయాన్ని పోలీసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని కూడ రిమాండ్ రిపోర్టులో పోలీసులు అభిప్రాయపడ్డారు. నిందితులు బయటకు వస్తే పారిపోయే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికి కోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. 

 

click me!