రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ, తెలుగు దేశం పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
అమరావతి: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) , తెలుగుదేశం పార్టీలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తున్నాయి. మరో వైపు తెలుగు దేశం, వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు.ఈ విషయమై స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం నాడు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రిటైర్ కానున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్, వైఎస్ఆర్‌సీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు రిటైర్ కానున్నారు. ఈ మూడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలను కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.ఈ ఘటన వైఎస్ఆర్‌సీపీని షాక్ కు గురి చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధకు ఓటు వేశారనే కారణంగా నలుగురు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటేసింది వైఎస్ఆర్‌సీపీ. ఈ నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని కూడ స్పీకర్ కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.
2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీకి చెందిన మద్దాల గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాంలు వైఎస్ఆర్‌సీపీకి జైకొట్టారు. ఈ నలుగురిపై అనర్హత వేటేయాలని గతంలోనే స్పీకర్ కు తెలుగు దేశం పార్టీ ఫిర్యాదు చేసింది.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి వారం రోజుల ముందు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల అంశం తెరమీదికి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలను దక్కించుకోవడానికి వైఎస్ఆర్‌సీపీ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ గంటా శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే వారం రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. తనను సంప్రదించకుండానే స్పీకర్ తన రాజీనామాను ఆమోదించారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.ఈ విషయమై న్యాయ పోరాటం కూడ చేస్తానని ఆయన ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ బలాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారని తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తుంది.
also read:డీఎల్, సునీతాతో భేటీ: కడపలో షర్మిల వ్యూహం ఫలిస్తుందా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఒక్కో రాజ్యసభ సభ్యుడు విజయం సాధించాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ 151 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 23 ఎమ్మెల్యేలకే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్‌సీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 19కి పడిపోయింది.
వైఎస్ఆర్‌సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో ఆ పార్టీ బలం 147కు పడిపోయింది. మరో వైపు జనసేన నుండి గెలుపొందిన రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్‌సీపీకి మద్దతుగా నిలిచారు. దరిమిలా ఆ పార్టీ 148కి చేరింది. టీడీపీకి చెందిన నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు కూడ ఆ పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీ బలం 152కు చేరనుంది.
also read:మాల్దీవులకు తగ్గిన భారత పర్యాటకులు:అగ్రస్థానం నుండి ఐదో స్థానంలోకి
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్. నాలుగు జాబితాల్లో 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలను మార్చారు. అయితే ఈ తరుణంలోనే సీట్లు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుంది. వర్ల రామయ్య, లేదా కోనేరు సురేష్ లను రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తుందనే ప్రచారం సాగుతుంది.పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ ఎన్నికల బరిలోకి వైఎస్ఆర్‌సీపీ బరిలోకి దింపాలని యోచిస్తుంది.
also read:బ్రిడ్జికి కలెక్టర్ పేరు: కోనసీమ జిల్లావాసుల అభిమానం ఇదీ...
అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పీకర్ నిర్ణయం ఆధారంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు అవసరం ఉంటుంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే అనర్హత నోటీసులు అందుకున్న కొందరు ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టులో నిన్నలంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులను ఇప్పడే పార్టీలో చేర్చుకోకుండా తెలుగు దేశం పార్టీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంది.