
భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబునాయుడును వదిలించుకోవాలనే చూస్తున్నట్లుంది. భాజపా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేసిన ప్రకటనకు అర్ధం అదే. ఎందుకంటే, మురళీధర్ రావు అంటే మామూలు నేత కాదు. ఒకవైపు ఆర్ఎస్ఎస్, ఇంకోవైపు ప్రధానమంత్రికి బాగా ఇష్టుడు. అటువంటి వ్యక్తి ఏ ప్రకటన చేసినా కీలకమే అవుతుంది. ఇపుడు మురళీ చేసిన ప్రకటనపైనే సర్వత్రా చర్చ మొదలైంది.
మొన్ననే ఎన్డీఏ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కూడా మిత్రపక్షాలన్నీ కలిసే పోటీ చేయాలన్నట్లుగా చర్చలు జరిగింది. ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతలో ఏపి గురించి మురళీ అటువంటి ప్రకటన చేసారంటే అర్ధం ఏమిటి? భాజపాను దేశం నలుమూలలా విస్తించేందుకు మోడి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంత వరకూ బాగానే ఉంది. పార్టీని విస్తరించటమంటే ఒంటరిగానూ చేయవచ్చు. లేదా మిత్రపక్షాల సహకారంతోనూ చేయవచ్చు.
అయితే, మిత్రపక్షంగా ఉండి భాజపాను బలోపేతం చేస్తామంటే ఏ మిత్రపక్షం కూడా అంగీకరించదు. అందులోనూ చంద్రబాబునాయుడు లాంటి వాళ్ళు అస్సలంగీరించరు. కాబట్టి టిడిపితో కలిసి ఉంటే సొంతంగా ఎదిగేది అనుమానమే అని భాజపా నేతలు జాతీయ నాయకత్వానికి ఎప్పటి నుండో చెబుతున్నమాటే. పైగా రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని భాజపా నేతలు నివేదికలు కూడా అందించారు.
అలాగే, చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని కూడా పలువురు నేతలు జాతీయ నాయకత్వానికి ఇప్పటికే రిపోర్టులు అందచేసినట్లు సమాచారం. అయితే, ఎవరి నివేదికలు ఇచ్చినా వెంకయ్యనాయుడే ఎవరి మాటను పడనీయటం లేదనే ప్రచారం పార్టీలోనే సాగుతుంది. అటువంటి నేపధ్యంలో మురళీ చేసిన ప్రకటనతో రాష్ట్ర నేతల్లో ఒక్కసారిగా ఆనందం తొంగి చూస్తోంది. అంటే వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేయటం దాదాపు ఖాయమన్నట్లే.