Andhra Pradesh : మార్కులు వేయలేదో... చేతబడి చేయిస్తా !: టీచర్ కు స్టూడెంట్ దమ్కీ 

By Arun Kumar PFirst Published Apr 11, 2024, 8:34 AM IST
Highlights

ప్రస్తుత విద్యావ్యవస్థ కేవలం మార్కుల చుట్టే పరుగెడుతోంది. మార్కుల కోసం విద్యార్థులపై టీచర్లు, తల్లిదండ్రుల ఒత్తిడి మరీ పెరిగిపోయింది. ఈ క్రమంలో మార్కుల కోసం విద్యార్థులు ఎంతకైనా తెగిస్తున్నారు... బాపట్లలో ఓ టెన్త్ విద్యార్థి ఏం చేసాడంటే..  

బాపట్ల : ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ముగిసాయి. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులు మంచిమార్కులు సాధిస్తామన్న ధీమాతో వుంటే పాస్ మార్కులతో గట్టెక్కినా చాలనుకుంటున్నారు మరికొందరు విద్యార్థులు. కానీ ఓ విద్యార్థి మాత్రం ఏకంగా ఉపాధ్యాయులనే బెదిరించి మార్కులు పొందాలని ప్రయత్నించాడు. తనకు మంచిమార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తానంటూ ఏకంగా జవాబు పత్రంపైనే రాసి బెదిరించాడు. జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయుడు ఉన్నతాధికారులు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో విద్యార్థి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. 

ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ స్కూళ్లలో పదో తరగతి పరీక్షాపత్రాలు మూల్యాంకన జరుగుతోంది. ఇలా బాపట్ల పురపాలక పాఠశాలలో కూడా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తెలుగు ఉపాధ్యాయుడొకరు విద్యార్థుల జవాబుపత్రాలను పరిశీలిస్తుండగా ఓ ఆసక్తికర విషయాన్ని గమనించాడు. రామాయణం ప్రాశస్త్యం గురించి అడిగిన ప్రశ్నకు జవాబు రాయకుండానే తనకు మార్కులు వేయాలని బెదిరించాడు ఓ విద్యార్థి. తనకు మార్కులు వేయకుంటే తన తాతకు చెప్పి చేతబడి చేయిస్తానంటూ జవాబు పత్రంలో రాసాడు. ఇలా విద్యార్థి బెదిరింపు ఆ ఉపాధ్యాయుడిని ఆశ్చర్యపర్చడంతో పాటు కొంత భయాన్ని కలిగించినట్లుంది. దీంతో అతడు వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు ఈ జవాబు పత్రాన్ని అందిచాడు. వారు కూడా విద్యార్థి చేతబడి బెదిరింపు చూసి ఆశ్చర్యపోయారు. 

వీడి దొంగ భక్తి చూడండి... దండం పెట్టిన చేతుల్తోనే అమ్మవారి నగలు దండుకుంటున్నాడు..!

అయితే మార్కుల కోసం విద్యార్థి చేతబడి బెదిరింపుల గురించి తెలిసి కొందరు సీరియస్ గా, మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిభకు మార్కులనే కొలమానంగా తీసుకోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని అంటున్నారు. మార్కుల కోసం విద్యార్థులు ఎంతకైనా తెగించడానికి సిద్దం అవుతున్నారని బాపట్ల వ్యవహారం తెలియజేస్తుందని అంటున్నారు. విద్యార్థులను మార్కుల కోసం ఒత్తిడిచేయడం మానేంతవరకు ఇలాంటివి జరుగుతూనే వుంటాయని కొందరి అభిప్రాయం. ఇక మరికొందరేమో 'ఏరా... మార్కుల కోసం చేతబడి చేస్తావా' అంటూ విద్యార్థి బెదిరింపు ఆన్సర్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  
 

click me!