Andhra Pradesh : కన్నీటిని దిగమింగుతూ కొడుకు శవాన్ని 8 కి.మీ మోసిన తండ్రి... ఈ పాపం ఎవరిది ?  

By Arun Kumar PFirst Published Apr 10, 2024, 11:01 AM IST
Highlights

మానవత్వానికే మచ్చలాంటి హృదయవిధారక ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ఏ తండ్రికి రాకూడని కష్టం ఓ నిరుపేద కూలీ వచ్చింది. ఆ కష్టం ఏమిటంటే....

పాడేరు : మనిషి రాతియుగం నుండి కంప్యూటర్ యుగానికి చేరుకున్నాడు. ఆకాశంలో చంద్రుడిని ఆశ్యర్యంగా చూసే రోజుల నుండి చంద్రమండలంపై అడుగుపెట్టే స్థాయికి చేరుకున్నాడు. ఇలా అభివృద్ది వెంటపడుతూ ఓ గొప్ప లక్షణాన్ని వదులుకున్నారు మనుషులు... అదే మానవత్వం. సాటి మనిషికి సాయం చేసే గుణాన్ని నేటి సమాజం విస్మరించింది. ఎవడు ఏమైపోతే నాకేంటి? నేను హాయిగా వుంటే చాలని చాలామంది అనుకుంటున్నారు. అభివృద్ది సంగతి దేవుడెరుగు... మనిషి మళ్ళీ ఆ అనాగరిక కాలంలోకి వెళ్లిపోయాడా అనేలా నేటి పరిస్థితులు వున్నాయి. మన కళ్ల ముందే అనేక హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నా కనీస స్పందన కరువయ్యింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిఒక్కరి మనసును కలచివేసే సంఘటన వెలుగుచూసింది. 

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలోని చినకోనెల గ్రామానికి చెందిన సార కొత్తయ్యది నిరుపేద కుటుంబం. అతడి రెక్కాడితే కాని ఆ కుటుంబం డొక్కాడదు. పేదరికంతో మగ్గిపోతున్న అతడు స్వగ్రామంలో ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నాడు. ఇలా గుంటూరు జిల్లా కొల్లూరులోని ఓ ఇటుకల బట్టీలో పనికి కుదిరాడు.  భార్యా బిడ్డలతో కలిసి అక్కడే నివాసం వుంటున్నాడు. 

అయితే ఇటీవల కొత్తయ్య చిన్నకొడుకు ఈశ్వరరావు అనారోగ్యం బారినపడ్డారు. మూడేళ్ల ఈ బాలుడి పరిస్థితి రోజురోజుకు మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. అతడికి చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది... గత సోమవారం ఈ చిన్నారి బాలుడు ప్రాణాలు విడిచాడు. దీంతో కొత్తయ్య కుటుంబంలో విషాదం నిండింది.  

తన కొడుకు అంత్యక్రియలను స్వగ్రామం చినకోనెలలో నిర్వహించాలని తండ్రి కొత్తయ్య భావించాడు. దీంతో ఓ అంబులెన్స్ లో కొడుకు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ చినకోనెల గ్రామానికి రోడ్డుమార్గం సరిగ్గా లేకపోవడంతో ఆ అంబులెన్స్ డ్రైవర్ బాలుడి మృతదేహాన్ని మార్గమధ్యలోనే దించేసి వెళ్ళిపోయాడు. మరో వాహనంలో తీసుకెళదామన్న రోడ్డు పరిస్థితి దారుణంగా వుండటంతో ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు... దీంతో చేసేదేమిలేక ఆ తండ్రి తన రెండుచేతుల్లోకి కొడుకు మృతదేహాన్ని తీసుకుని నడక ప్రారంభించాడు. 

కన్నీటిని దిగమింగుకుంటూనే విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ గ్రామం నుండి స్వగ్రామం చినకోనెలకు బయలుదేరాడు. ఇలా దాదాపు ఎనిమిది కిలోమీటర్లు కొడుకు మృతదేహాన్ని మోసాడు. మంగళవారం తెల్లవారుజామున ప్రయాణం ప్రారంభించి ఉదయానికి గ్రామానికి చేరుకున్నాడు. ఇలా పుట్టెడు దు:ఖంలోనూ కొడుకు శవాన్ని మోస్తున్న ఆ తండ్రిని చూసి జాలిపడటం తప్ప ఎవరూ ఏం చేయలేని పరిస్థితి.    

కొత్తయ్య దీన స్థితికి పాలకులే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన రాష్ట్రంలో పరిస్థితిని, పేదవాడి బ్రతుకుకు అద్దం పడుతోందని అంటున్నారు. ఈ కాలంలో కూడా గ్రామాలకు రోడ్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలను చూసయినా పాలకులు మేలుకోవాలని... గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. 

click me!