Andhra Pradesh Assembly Elections 2024 :  వైఎస్ జగన్ కు వైఫ్ స్ట్రోక్...

By Arun Kumar PFirst Published Apr 9, 2024, 11:13 AM IST
Highlights

ఇప్పటికే సొంత చెల్లెల్లు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత వ్యతిరేకంగా మారడం... తల్లి విజయమ్మ కూతురు వైపే వుండటం... సోదరుడు అవినాష్ రెడ్డిపై హత్యాకేసులు... ఇలా జగన్ కు  కుటుంబసభ్యుల తీరు పెద్ద తలనొప్పిగా మారింది. చివరకు భార్య భారతితో కూడా జగన్ కు తిప్పలు తప్పడంలేదు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు జతకట్టాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడుతూ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అయితే జగన్ మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్నారు. కానీ ఈ ఎన్నికలు జగన్ కు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులే కాదు ఎన్నికల సర్వేలు కూడా చెబుతున్నాయి. ప్రత్యర్థి కూటమి సంగతేమో గానీ సొంత కుటుంబసభ్యులే జగన్ కు పక్కలో బల్లెంలా మారారు. ఇప్పటికే చెల్లి పోటుతో సతమతం అవుతున్న వైఎస్ జగన్ కు భార్య భారతి వ్యవహారం మరో తలనొప్పి తెచ్చిపెట్టింది. 

వైఎస్ భారతి వ్యవహారం :  

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి రాజకీయాలకు దూరంగా వుంటారు. అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి రాజకీయ నేపథ్యం వున్నా ఆమె మాత్రం ఏనాడు రాజకీయాల వైపు చూడలేదు. కానీ ఆమెను రాజకీయాలు వదలడం లేదు. భర్త ముఖ్యమంత్రి కావడం, పుట్టింటివారు కూడా వైసిపిలో వుండటంతో భారతి పేరు తరచూ రాజకీయాల్లో వినిపిస్తుంది. వైఎస్ కుటుంబానికి కాకుండా తన పుట్టింటివారికి పదవులు ఇప్పించుకోవడంలో భారతి సక్సెస్ అయ్యారన్న ప్రచారం వుంది. ప్రత్యక్ష రాజకీయాలు చేయకున్న వైఎస్ జగన్ ను వెనకుండి నడిపిస్తున్నది భార్య భారతి అన్నది వైఎస్ కుటుంబసభ్యులే ఆరోపిస్తున్నారు.  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య వెనక వైఎస్ భారతి పాత్ర వుందని ప్రచారం జరుగుతోంది. వివేకా హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి లు సొంత మేనమామ, మేనబావ అవుతారు. అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు దక్కకుండా అడ్డుపడుతున్నాడనే వివేకాను హత్య చేసారని... ఈ హత్య విషయం వైఎస్ భారతికి ముందుగానే తెలుసన్నది వైసిపి ప్రత్యర్థుల వాదన. భార్యపై వచ్చిన ఈ ఆరోపణలు జగన్ మెడకు కూడా చుట్టుకున్నాయి. 

తన తండ్రి వైఎస్ వివేకాను హత్యచేసిన వారికి అన్న వైఎస్ జగన్ అండగా నిలిచారని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. భార్య భారతి ఒత్తిడితోనే అవినాష్ ను జగన్ కాపాడుతున్నాడని అంటున్నారు. తన తండ్రిని చంపినవారిని కాపాడుతున్న జగనన్నకు ప్రజలు ఓటు వేయవద్దని సునీత కోరుతున్నారు. ఆమె తన సోదరి వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేస్తున్నారు. 

ఇలా వైఎస్ వివేకా మర్డర్ వ్యవహారంలో వైఎస్ భారతి పేరు జగన్ రాజకీయాలకు ఎఫెక్ట్ చేస్తోంది. భార్య భారతి వ్యవహారం ఎన్నికల వేళ జగన్ కు తలనొప్పిగా మారింది.వైఎస్ భారతిపై జరుగుతున్న ప్రచారం ఈ ఎన్నికల్లో వైసిపిపై పక్కా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

చెల్లి షర్మిల ఎఫెక్ట్ : 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుల మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. కొడుకు వైఎస్ జగన్, కూతురు వైఎస్ షర్మిల వేరువేరు పార్టీల నుండి పోటీచేస్తూ పరస్పరం తలపడతున్నారు. వైఎస్ షర్మిల తన తండ్రి చనిపోయేవరకు కొనసాగిన కాంగ్రెస్ పార్టీలో   చేరి తానే అసలైన వారసురాలినని చెప్పుకుంటోంది. ఇలా చెల్లి షర్మిల వ్యతిరేక రాజకీయాలు కూడా వైఎస్ జగన్, వైసిపి పై ప్రభావం చూపనున్నారు. 

షర్మిల తన అన్న వైఎస్ పాలనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అలాగే వైసిపి కోసం ఎంతో కష్టపడ్డ తనకు అన్యాయం జరిగిందని షర్మిల అంటున్నారు. దీంతో సొంత చెల్లికి న్యాయం చేయలేనివాడు ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఇద్దరూ అన్న వైఎస్ జగన్ కు గెలిపించవద్దని కోరుతున్నారు. 

తల్లి విజయమ్మ :  

వైఎస్ జగన్ కు సొంత తల్లి విజయమ్మ కూడా సపోర్ట్  చేయడంలేదని... కూతురు షర్మిల పక్షానే ఆమె నిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది.   ఇటీవల కూతురు షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా విజయమ్మ విజయతిలకం దిద్ది పంపించారు. కడప ఎంపీగా పోటీచేస్తున్న షర్మిల తరపున విజయమ్మ  ప్రచారం చేసే అవకాశాలున్నాయంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రభావం వుంటుంది... జగన్ ప్రత్యర్థులకు ఇదో అస్త్రంగా మారుతుంది. సొంత తల్లే జగన్ పార్టీని వ్యతిరేకిస్తుందని ప్రచారం చేయవచ్చు. ఇలా వైఎస్ విజయమ్మ తీరుకూడా వైఎస్ జగన్ కు తలనొప్పిగా మారింది. 

సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి : 

వైఎస్ వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో అతడు అరెస్ట్ మాత్రమే కాలేదు... జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. జగన్ సహాయంతో అవినాష్ ఈ హత్యచేసాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి... దీన్ని ప్రజల్లోకి కూడా బలంగా తీసుకెళ్లాయి. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి. ఇలా తీవ్ర ఆరోపణలు వున్నప్పటికీ కడప లోక్ సభలో మళ్లీ అవినాష్ నే పోటీలో నిలిపారు వైఎస్ జగన్. 

అవినాష్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్ షర్మిల ఆయనపై పోటీకి సిద్దమయ్యింది. కాంగ్రెస్ పార్టీనుండి ఆమె కడపలో పోటీ చేస్తున్నారు. ఇలా అవినాష్ రెడ్డిపై హత్యా ఆరోపణలు, అతడి ఓడించేందుకు షర్మిల రంగంలోకి దిగడం వైసిపి పై ప్రభావం చూపనున్నాయి.
 

click me!