
గుంటూరు : నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 4,500 ఎకరాల భూమిని తిరుమల తర్వాత రెండో ధనిక దేవాలయంగా పేరొందిన శ్రీశైలం ఆలయానికి బదలాయించేందుకు ఏపీ అటవీశాఖ అంగీకరించింది. ఆలయ సమీపంలోని విలువైన భూమిపై హక్కుల కోసం గత ఐదు దశాబ్దాలుగా అటవీ, దేవాదాయ శాఖలు పరస్పరం పోరాడుతున్న విషయం తెలిసిందే. వివాదాస్పద భూమి ఆలయానికి సంబంధించిందే అని రుజువు చేసే కొన్ని చారిత్రక రికార్డులతో పకడ్బందీగా నిరూపించారు.
స్థానిక శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు అటవీ శాఖ సీనియర్ అధికారులను అభ్యర్థించారు. ఈ వివాదం వల్ల దేవాదాయ శాఖలకు గానీ, అటవీ శాఖలకు గానీ ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆయన వాదించారు. తదనంతరం, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై మధుసూదన్ రెడ్డి ఎస్టేట్స్ వింగ్ నుండి సీనియర్ అధికారులను మోహరించారు. వాస్తవాలను నిర్ధారించడానికి పురావస్తు శాఖ సహాయాన్ని కూడా తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూ సమగ్ర సర్వేను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు కూడా అధ్యయనాల్లో భాగస్వామ్యమయ్యారు.
వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ హైకోర్టులో వైఎస్ సునీతా ఇంప్లీడ్ పిటిషన్
రెవెన్యూ, అటవీ, ఎండోమెంట్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఆర్కియాలజీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు భారీ డాక్యుమెంట్లను అధ్యయనం చేసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయి సర్వే చేపట్టాయి. దీనికోసం డ్రోన్లను కూడా ఉపయోగించారు. అనేక నెలల అధ్యయనం తర్వాత, ప్రత్యేక బృందాలు ఈ భుమికి యజమానులు బ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవుళ్లేనని నిర్ధారించారు. “భూమి ఆలయం ఆధీనంలో ఉందని ప్రశ్నించడానికి వీలు లేకుండా నిర్ధారించబడింది. ఐదు దశాబ్దాల పోరాటం తర్వాత 4,500 ఎకరాల భూమిని ఆలయ నిర్వహణలోకి తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కూడిన మంత్రుల బృందం ఆలయ నిర్వహణకు అధికారికంగా భూమిని అప్పగించేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌ను అభ్యర్థించింది. ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపేందుకు ఆలయ అధికారులతో అధికారిక ఒప్పందంపై సంతకం చేయాలని స్థానిక డివిజనల్ ఫారెస్ట్ అధికారిని మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానం ఈఓ ఎస్ లవన్న, అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలన్ చోంగ్ టెరాన్‌లు 4,500 ఎకరాల భూమిపై అటవీశాఖ తమ హక్కులను ఆలయ అధికారులకు వదులుకునేందుకు అంగీకరించిన ఎంఓయూపై సంతకాలు చేశారు.