
శ్రీరాముడి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవిని జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతాయుగంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. శ్రీరామ నవమి నాడు సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. అయితే ఈ ఏడాది శ్రీరామనవమి ఈ నెల అంటే మార్చి 30న వచ్చింది.
ఈ సందర్బంగా ఆలయాలన్నీ శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్దమవుతున్నాయి. కాగా వైఎస్సార్ జిల్లాలోని పురాతన ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 8 వరకు ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమవుతోంది.
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ ఒంటిమిట్ట ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి గురువారం టీటీడీ అధికారులు, కడప జిల్లా యంత్రాంగంతో కలిసి ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
గతేడాది జరిగిన విషయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీరామనవమి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ సమన్వయ సమావేశంలో భక్తులకు సీటింగ్ ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అదనపు పార్కింగ్ స్థలాల ఏర్పాటు, క్యూలైన్ల ఏర్పాటు, ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.