ఇది శ్రీకాకుళ టిడిపి వీరగాధ

Published : Jan 06, 2017, 06:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఇది శ్రీకాకుళ టిడిపి వీరగాధ

సారాంశం

మంచి పేరు తెచ్చుకునేందుకు ఒకరేదయినా ఒక ప్రాజక్టు తీసుకువస్తే, ప్రత్యర్థులు  రేయింబగలు పోరాడి, సమస్యలు సృష్టించి  దానిని రాకుండాచేస్తున్నారట

 శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు తెలుగుదేశం నాయకులు తెగ కొట్టుకున్నారులే.

 

అయితే, ఇది పబ్లిక్గా జరగడం లేదు గాని, గాయాలు , రక్తం మరకలు  మాత్రం జిల్లాలో బాగా కనబడుతున్నాయి.

 

 మంత్రి కింజారాపు అచ్చన్నాయుడు,  రాష్ట్ర తెలుగుదేశం  అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, ప్రభుత్వం విప్ కూన రవికుమార్ లు కత్తులు కటార్లతో  కాకుండా కుట్రలు కుతంత్రాలతో తన్నుకుంటున్నారని జిల్లాలో  ఎవర్నడిగినా చెబుతారు. 

 

2019 లో టిడిపికి ముప్పు తెచ్చేలా వీళ్ల వైషమ్యాలు  ముదురుతున్నాయని అంటున్నారు.  మంచి పేరు తెచ్చుకునేందుకు ఒకరేదయినా ఒక ప్రాజక్టు తీసుకువస్తే...మిగతవారు రేయింబగలు కష్టపడి, అన్నిరాకల సమస్యలు సృష్టించి  దానిని రాకుండాచేస్తున్నారనేది  ఆరోపణ. అందుకే గత రెండున్నరేళ్లో ముఖ్యమంత్రి పర్యటనలు తప్ప జరిగిందేమీ లేదని విమర్శలు.

 

నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గంలో త్రిపుల్ ఐటీ శంకుస్థాపన చేయాల్సి ఉండింది. అయితే, చివరి నిమిషంలో ఆయన పర్యటనలో మార్పులు జరిగిపోయాయి.

 

దీనంతటికీ మంత్రి అచ్చెన్నాయుడే కారకుడు అంటూ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు  వర్గం ఆరోపిస్తున్నది. ఎచ్చర్ల కళానియోజకవర్గం కాబట్టి అక్కడ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ వస్తే తన శత్రువర్గం బలపడుతుందని అచ్చన భయమట.  అచ్చన్న, కళా ల మధ్య గొడవ కింజారపు ఎర్రన్న కాలం  నాటిది.

 

 ప్రభుత్వం శ్రీకాకుళానికి త్రిపుల్ ఐటీ మంజూరు చేసినపుడు జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు సంతోషించారు. అందుకు ఏర్పాట్లు కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఎస్.ఎం.పురంలో చకచకా చేశారు.

 

దానికి అవసరమైన భూమిని కేటాయించారు. దీనిని కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. కాని రెండురోజుల క్రితం రెవెన్యూశాఖ ఆ భూములు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో త్రిపుల్‌ఐటీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రశ్న మొదలైంది. ఎందుకిలా జరిగిందనేదానికి మరొక కథ ఉంది.

 

జిల్లాలో నిర్మించ తలపెట్టిన భావనపాడు ఓడరేవు నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ అడ్డుపుల్ల వేసింది.  అదానీ సంస్థ ఈ ప్రాజెక్టుకు బిడ్ వేసినప్పటికీ,వెనక్కు తగ్గుతున్నట్లు సమాచారం. అనేక  అవస్థలుపడి మంత్రి అచ్చెన్నాయుడు రైతులను మత్స్యకారులను  ఒప్పించిన  న్యాయస్థానంలో దాఖలైన కేసులను విత్‌డ్రా చేయించారని చెబుతారు. పోర్టు నిర్మాణానికి పునాది రాయి వేసేందుకు అంతా సిద్దమయ్యాక రక్షణ శాఖ అడ్డంకి వచ్చింది. దీని వెనక  కళా వెంకటరావు ఉన్నాడని అచ్చన అభిమానసంఘాల ఆరోపణ. అందుకే కళా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఇపుడు ఎచ్చర్ల నుంచి ట్రిపుల్ ఐటి ని అచ్చన్నఅడ్డుకున్నారని జిల్లాలో పుకారు.

 

ఇపుడు కూన రవి  కూమార్ పరిస్థితి చూద్దాం.

 

ఆమదాలవలసలో  మూతపడిన చక్కెర పరిశ్రమను తెరిపిస్తానంటూ స్వయంగా చంద్రబాబు 2014 అసెంబ్లీ ఎన్నికపుడు ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఫలితంగా టిడిపి అభ్యర్థి  కూన రవికుమార్‌ గెలిచాడు.  ఎమ్మెల్యే అయి, క్యాబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ విప్ కూడ అయ్యాడు.

 

అన్నట్లు గానే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫ్యాక్టరీ గేట్లు  గేట్లు ముఖ్యమంత్రి ఎపుడయినా తెరిపిస్తారని ఆశిస్తున్నపుడు చెరకు రైతులకు  చేదు కబురు ప్రభుత్వం నుంచి వెలువడింది. ఫ్యాక్టరీ ప్రారంభించడం ఇప్పట్లో జరగదని, అలాంటి కార్యక్రమం ఏదీ లేదనేది ఆ చల్లని కబురు. ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు అనుకూలంగా లేరని, ఇది వస్తే,  కూన బలిసి తనకు పోటీఅవుతాడని అచ్చన్నాయుడు భయమని కూన వర్గం ఆరోపిస్తున్నది.

 

ఈ కక్షలు కార్పణ్యాలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి చెమటు పట్టించడం ఖాయమని జిల్లాలో బాగా వినపడుతున్నమాట.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu
Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu