
ఎట్టకేలకు కోడెల శివప్రసదరావు కోరిక తీరబోతున్నట్లే ఉంది. ఎలాగైనా తన సొంత జిల్లా గుంటూరులో అసెంబ్లీ సమావేశాలు జరపాలన్న కోరిక స్పీకర్ కు ఎప్పటి నుండో బలంగా ఉంది. అయితే ఎప్పటికప్పుడు పరిస్ధితులు కలసి రావటం లేదు. దాంతో ఆయన ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి.
ప్రతిసారీ ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాల వెలగపూడిలో జరుగుతాయని కోడెల చెప్పటం, సాధ్యం కాదని ప్రభుత్వం ప్రకటించటం మామూలైపోయింది.
దాంతో సమావేశాల వేదిక గురించి కోడెల ప్రకటనలు చేయటం మానుకున్నారు. అలాంటిది ఇంతకాలానికి ఆయన కోరిక తీరే అవకాశం కనబడతోంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పేదాన్ని బట్టి సమావేశాలు వెలగపూడిలో జరుగుతాయనే అనిపిస్తోంది.
అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని గురువారం కోడెల పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈనెలాఖరులో భవనాల నిర్మాణం పూర్తవుతుందన్నారు.
వచ్చే నెల రెండోవారంలో శీతాకాల సమావేశాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు జరుపుతామన్నారు. శీతాకాల సమావేశాల నిర్వహణ సాధ్యం కాకపోతే ఏకంగా బడ్జెట్ సమావేశాలనే ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించేస్తామని కూడా తెలిపారు.
అంత వరకూ బాగానే ఉంది కానీ, భవనంలోపల జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. సీటింగ్, ఎలక్ట్రికల్ తదితర పనులు పూర్తవ్వాలి. చాలా కాలంగా పనులు అయిపోతాయనే చెబుతున్నారు. అయినా కావటం లేదు. దాంతో ఈసారి స్పీకర్ కాస్త సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం.
అందువల్లే వచ్చే సమావేశాల తేదీలను కూడా ఉజ్జాయింపుగా ప్రకటించారు. నిజంగా ఈనెలాఖరులోగా పనులు పూర్తయితే ఏపిలో అసెంబ్లీ సమావేశాలను మొదటిసారిగా రాష్ట్రంలో నిర్వహించిన ఘనత కోడెలకే దక్కుతుందనటంలో సందేహం లేదు.