ఎంసెట్ -2 పేపర్ లీకేజీ కేసులో శ్రీచైతన్య కాలేజీ డీన్ అరెస్ట్

First Published Jul 5, 2018, 6:48 PM IST
Highlights

ఎంసెట్ -2  పేపర్ కేసులో ఇద్దరు నిందితులను గురువారం నాడు సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్య కాలేజీలో డీన్ గా పనిచేస్తున్న వాసుబాబుతో పాటు నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఆడ్మిషన్లకు ఏజంటుగా పనిచేస్తున్న శివనారాయణలను అరెస్ట్ చేశారు. ఆరుగురు విద్యార్ధులకు ఈ పేపర్లను వీరిద్దరూ అందజేశారని సీఐడీ పేర్కొంది. ఒక్కొక్క విద్యార్ధి నుండి రూ.35 లక్షలు వసూలు చేశారని సీఐడీ ప్రకటించింది.


హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ -2 పేపర్ లీకేజీలో  ఛైతన్య కాలేజీ డీన్ వోలేటీ వాసుబాబుతో పాటు నారాయణ,శ్రీచైతన్య కాలేజీల ఆడ్మిషన్ల ఏజంట్ వెంకట శివనారాయణలను అరెస్ట్ చేసినట్టు సీఐడీ పోలీసులు గురువారం నాడు ప్రకటించారు.

హైద్రాబాద్ చైతన్య కాలేజీతో పాటు మరో 6 కాలేజీలకు వోలేటీ వాసుబాబు డీన్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఆడ్మిషన్లకు ఏజంటుగా పనిచేసే శివనారాయణలు ఎంసెట్  పేపర్ లీకేజీ నిందితులతో సంబంధాలు కలిగి ఉన్నారని సీఐడీ గుర్తించింది.

2016 జూలైలో ఎంసెట్ పేపర్ లీకేజీ ప్రధాన నిందితుడిని వాసుబాబు కలిశారని సీఐడీ అధికారులు ప్రకటించారు. శివనారాయణ, వాసుబాలు ఇద్దరూ కలిసి  ఆరుగురు విద్యార్ధులకు ఈ పేపర్ ను ఇచ్చారని సీఐడీ ప్రకటించింది.  ఒక్కొక్క విద్యార్ధి నుండి వీరిద్దరూ రూ.35 లక్షలను వసూలు చేసినట్టు పోలీసులు ప్రకటించారు.

ఈ పేపర్ ను ముందే తెలుసుకొన్న ఆరుగురు విద్యార్ధులకు ఎంసెట్‌లో  మంచి మార్కులు వచ్చినట్టు సీఐడీ ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు ఇచ్చిన  సమాచారం మేరకు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరులో ఉన్న శివనారాయణను గురువారం నాడు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ లో ఉన్న వాసుబాబును ఇక్కడే అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కూడ పేపర్ లీకేజీ నిందితులతో టచ్‌లో ఉండేవారని సీఐడీ పోలీసులు ప్రకటించారు.

click me!