మళ్లీ మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరగకూడదనే మూడు రాజధానులు: స్పీకర్ తమ్మినేని

Published : Oct 15, 2022, 01:32 PM IST
మళ్లీ మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరగకూడదనే మూడు రాజధానులు: స్పీకర్ తమ్మినేని

సారాంశం

విశాఖపట్నంలో ఒకవైపు జడివాన.. మరోవైపు జనవాన ఉందని ఏపీ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారామ్ అన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉండాలని.. ఇంతటి జడివానలో కూడా ఎవరూ వెనక్కి తగ్గలేదని చెప్పారు. 

విశాఖపట్నంలో ఒకవైపు జడివాన.. మరోవైపు జనవాన ఉందని ఏపీ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారామ్ అన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉండాలని.. ఇంతటి జడివానలో కూడా ఎవరూ వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఉత్తరాంధ్ర గర్జన ముందు.. చంద్రబాబు గర్జన బలాదూరు అని విమర్శించారు. ఉత్తరాంధ్ర అన్ని రకాలుగా వివక్షకు గురైందని అన్నారు. భూమి కోసం, భూక్తి కోసం, విముక్తి కోసం ఆనాడూ ఉద్యమాలు జరిగాయని అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన విశాఖ గర్జన ర్యాలీ‌లో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. 

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. భావి తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటమని చెప్పారు. మళ్లీ మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరగకూడదని.. మూడు ప్రాంతాల అభివృద్ది కోసం సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.  మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని నిలదీయాలని కోరారు. విశాఖను రాజధానిగా అయ్యేంతవరకు ఉద్యమాన్ని రక్షించుకోవాలని అన్నారు. 

రాయలసీమ గడ్డ మీద పుట్టిన తాను ఉత్తరాంధ్రకు వచ్చి మద్దతు ఇస్తున్నానంటే.. సీఎం జగన్ అజెండా ఎంత గొప్పదో ఆలోచించాలని మంత్రి ఆర్కే రోజా కోరారు. చంద్రబాబు చేసిన వెధవ పనుల వల్ల, అత్యాశతో దోచుకుని దాచుకోవడం వల్ల.. మన ప్రాంతాలు అన్యాయం అయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగినట్టుగా ఒక్క అమరావతిలో అభివృద్ది జరిగితే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్యాయం అయిపోతాయని అన్నారు. అందుకే సీఎం జగన్ పరిపాలన, వికేంద్రీకరణ అని.. మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ‘‘పవన్ కల్యాణ్‌కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలని, పోటీ చేయడానికి గాజువాక కావాలని, నటన నేర్చుకోవడానికి, షూటింగ్‌లకు, సినిమా కలెక్షన్‌లకు కూడా వైజాగ్ కావాలని..  కానీ వైజాగ్‌కు పరిపాలన రాజధాని వద్దు అని అంటున్నారంటే.. ఈ ప్రాంతం అభివృద్ది చెందడం ఆయనకు నచ్చదు’’అని రోజా అన్నారు. 

ఇక, వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం నుంచి విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన నాయకులు.. గర్జన ర్యాలీని ప్రారంభించారు. బీచ్‌ రోడ్డులోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర విశాఖ గర్జన ర్యాలీ సాగింది. అక్కడ నాయకులు వైస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. 

ఈ ర్యాలీలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు, ఉత్తరాంధ్ర వైసీపీ ప్రజాప్రతినిధులు, పలు వర్గాలకు చెందినవారు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. నగరంలో వర్షం కురుస్తున్నప్పటికీ.. విశాఖ గర్జన ర్యాలీ కొనసాగుతుంది. విశాఖ గర్జన ర్యాలీలో పాల్గొన్న వారంతా.. విశాఖకు రాజధాని రావాలంటూ నివాదాలు చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu