చంద్రబాబు వల్లే వాజ్ పేయ్ మంచానపడ్డారు

First Published Dec 19, 2017, 11:52 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడుపై భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబునాయుడుపై భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. 2003లో చంద్రబాబు చేసిన చారిత్రాత్మక తప్పిదం వల్లే మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయ్ మంచాన పడ్డారంటూ పెద్ద బాంబే పేల్చారు. చంద్రబాబుకు వాజ్ పేయ్ మంచాన పడటానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారు. వీర్రాజు చెప్పిన ప్రకారం, చంద్రబాబు మాటలను నమ్మిన వాజ్ పేయ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారట. అయితే, ఆ ఎన్నికల్లో ఏపిలో చంద్రబాబు, జాతీయస్ధాయిలో వాజ్ పేయ్ ఇద్దరూ అధికారాన్ని కోల్పోయారట. ఆ మనోవ్యధతోనే వాజ్ పేయ్ మంచానపడ్డారన్నది వీర్రాజు చెప్పిన లాజిక్.

చంద్రబాబును తాము ఎంతో నమ్మామని, ఎంతో ఆధరించినట్లు చెప్పారు. అయితే, మిత్రపక్షంగా చంద్రబాబుకు తామిచ్చిన విలువ, మర్యాద టిడిపి తమకు ఎన్నడూ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతీసారి మిత్రపక్షం తమను మోసం చేస్తూనే ఉందని ద్వజమెత్తారు. భాజపా బలోపేతం అవుతుందంటే టిడిపి తట్టుకోలేకపోతోందంటూ మండిపడ్డారు. అందుకే తమపై టిడిపి నేతలు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు ఎంఎల్సీ అభిప్రాయపడ్డారు. 175 అసెంబ్లీ సీట్లకు 25 ఎంపి సీట్లకు తాము పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వీర్రాజు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. భాజపా విడిగా పోటీ చేస్తే 9 శాతం ఓట్లు వచ్చాయని, అదే పోయిన ఎన్నికల్లో ముగ్గురమూ కలిసి పోటీచేస్తే భాజపాకు వచ్చింది. 2 శాతం ఓట్లే అన్నారు.

మిత్రపక్షంగా ఉన్నందు వల్ల తమకు ఒరిగిందేమీ లేదన్నారు. పెన్షన్లు ఇప్పుంచుకోలేకపోతున్నామని, అర్హులకు ఇళ్ళు కూడా ఇప్పించుకోలేకపోతున్నట్లు వాపోయారు. టిడిపి వల్లే తమ పార్టీకి నాలుగు సీట్లు వచ్చాయన్నది నిజమైతే, మరి 2003లో టిడిపి ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని నిలదీసారు. 2009లో ఎందుకు ఓడిపోయిందో టిడిపి చెప్పగలదా అంటూ ప్రశ్నించారు. గుజరాత్ ఎన్నికల విజయం తాలూకు ప్రభావం ఏపిపైన తీవ్రంగానే ఉండబోయేట్లుంది. 2019 ఎన్నికల్లో భాజపా ఒంటిరి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోందని చెప్పటం గమనార్హం.

 

click me!