కర్నూలు ఎంఎల్సీపై అధినేతల వ్యూహాలు

First Published Dec 19, 2017, 8:23 AM IST
Highlights
  • గెలుపోటములను పక్కన పెడితే పోటీ మాత్రం గట్టిగా ఉంటుందనటంలో సందేహం అవసరంలేదు

కర్నూలు జిల్లాలో మరో రసవత్తర పోరుకు తెరలేచింది. స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీ ఎన్నిక జనవరి 12న జరగబోతోంది. దాంతో రెండు ప్రధాన పార్టీల్లోనూ అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠ మొదలైంది. టిడిపి అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే పోటీ ఎక్కువుంటుంది. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, అందులోనూ మొన్న నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోయింది కాబట్టి వైసిపి తరపున పోటీ  చేయటానికి నేతలు వెనకాడుతారు. అయితే, రెండు పార్టీలకు ప్లస్సులు మైనస్సులున్నాయన్న విషయం మరచిపోకూడదు. అందుకనే పోటీపై సర్వత్రా ఆశక్తి మొదలైంది.

టిడిపి తరపున బనగానపల్లి మాజీ ఎంఎల్ఏ చల్లా రామకృష్ణారెడ్డి, నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి, డి. వెంకటేశ్వరరెడ్డి, కెఇ ప్రభాకర్ పోటీలో ఉన్నారు. టిక్కెట్టును ఆశిస్తున్న వారందరికీ ఎవరి బలాలు, బలహీనతలు వారికి ఉన్నాయి. పోటీ అందుకే అభ్యర్ధి ఎంపిక అంత సులభం కాదని తేలిపోయింది.  ఈనెల చివరలో చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా అభ్యర్ధిని నిర్ణయించే అవకాశం ఉంది.

సరే, వైసిపి విషయం చూస్తే మాజీ ఎంఎల్సీ చక్రపాణిరెడ్డి పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నుండి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులోనూ మొన్ననే సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. మళ్ళీ వెంటనే మరో ఉపఎన్నికంటే కష్టమే. అందుకే జిల్లా అధ్యక్షుడు, పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన గౌరు వెంకట్ రెడ్డే మళ్ళీ అభ్యర్ధయ్యే అవకాశాలున్నాయి.

పోయిన ఎన్నికలో కూడా అభ్యర్ధిని గెలిపించుకునేందుకు చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నాలు లేవు. అంత చేసినా టిడిపి అభ్యర్ధిగా శిల్పా చక్రపాణిరెడ్డికి వచ్చింది 62 ఓట్ల మెజారిటీనే. అంటే, వైసిపికి జిల్లాలో ఏ స్ధాయిలో బలముందో అర్ధమవుతోంది. శిల్పాబ్రదర్స్ తో పోల్చుకుంటే అప్పటి వైసిపి అభ్యర్ధి ఆర్ధికంగా బలహీనుడు. అటువంటిది ఇపుడు శిల్పా బ్రదర్స్, వెంకట్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారు.  కాబట్టి మళ్ళీ వెంకట్ రెడ్డే గనుక వైసిపి అభ్యర్ధిగా పోటీ చేస్తే గెలిచినా గెలవచ్చు. ఎందుకంటే, శిల్పా బ్రదర్స్ టిడిపిని వదిలేసి వైసిపిలో చేరటంతో వైసిపి బలం పెరిగినట్లే లెక్క.   

 

 

click me!