
వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు ఏపీ బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము వీర్రాజు. బీజేపీ - జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వుంటుందని పవన్ కల్యాన్ చెప్పలేద ఆయన అంటున్నారు.
అంతకుముందు ప్రెస్‌మీట్లు కాదు డైరెక్ట్ డిబేట్‌కు తాము సిద్ధమన్నారు సోము వీర్రాజు (somu veerraju) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి రాబోయే రోజుల్లో తాము ఆందోళన ఉద్ధృతం చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. 2014-15లో ఏపీ విభజన తర్వాత కేంద్ర పన్నుల కింద రూ.24,500 కోట్లు ఇచ్చామని చెప్పారు. 2020-21 నాటికి రూ.72,000 కోట్లు ఇచ్చామని సోము వీర్రాజు వెల్లడించారు. తాము ఇన్ని నిధలు ఇవ్వబట్టే.. నవరత్నాల కింద సంక్షేమ కార్యక్రమాలకు వాడుతున్నారంటూ ఆయన ఫైరయ్యారు.
కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. కడపలో తాము నిర్వహించిన సభకు భారీ స్పందన రావడంతో వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలపై అభిమానంతో ఏపీ రహదారుల కోసం రూ.65000 కోట్లు ఇచ్చామని సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్రం నిధులు వాడుకుంటూనే తిట్టడం సబబు కాదన్నారు. జగన్ పాలనలో వేసిన రోడ్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఇళ్లు ఇచ్చామని.. ఇందుకోసం రూ.32 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
ఇకపోతే.. ఇటీవలే జనసేన (janasena) అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదని జనసేన 8వ ఆవిర్భవ సభలో తెలిపారు. కాబట్టి, తాము అన్ని శక్తులు కలిసి వెళ్తాయని చెప్పారు. అయితే, భవిష్యత్ పోరాటానికి సంబంధించి బీజేపీ తమకు రోడ్ మ్యాప్ అందించాలని కోరారు. బీజేపీ రోడ్ మ్యాప్ అందిస్తే.. అమలు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్లో ఆయన బీజేపీతోపాటు టీడీపీనీ కలుపుకోవాలనే ఉద్దేశ్యం ధ్వనించింది.
టీడీపీతో (tdp) జత కట్టాలని జనసేన యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ, బీజేపీ మాత్రం అందుకు సుముఖంగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీతో దోస్తీ కట్టేది లేదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే జనసేన ప్రతిపాదనపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా, సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఒక విషయం స్పష్టం అవుతున్నది. జనసేన, బీజేపీ పొత్తు మాత్రమే ప్రత్యామ్నాయం అని ఆయన పేర్కొన్నారు. అందులో టీడీపీ ప్రస్తావన తేలేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిక వంటి అంశాలను పేర్కొనలేదు. అంటే.. జనసేనతో మాత్రమే బీజేపీ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నదని స్పష్టమవుతోంది.